Monday, August 22, 2011

LONG LIVE ANNA

ఇపుడు జగమంతా ఒక్కటే మంత్రం. అదే అన్నా హజారే మంత్రం. అవును ఓ గాంధేయవాది నిస్వార్థంగా చేపట్టిన పోరాటం- యావత్‌ జాతిని కదిలించింది. కులమత భేదాలు లేకుండా, వయోపరిమితి భేదాలు లేకుండా అందర్నీ ఒక్క తాటిపైకి తెచ్చింది. ముఖ్యంగా యూపీఏ-2 సర్కార్‌ అధికారంలోకి వచ్చాక దేశంలో అవినీతి విచ్చలవిడిగా జరిగింది. రాజకీయ రాబందులు జాతి సంపదను దోచుకున్నారు. మనకళ్లముందే వేల కోట్ల రూపాయల గుటకాయ స్వాహా అయిపోయాయి. ఇవన్నీ చూస్తూ మనమనంతా ఊరుకున్నాం. మనకెందుకులే అని కళ్లుమూసుకున్నాం. కానీ న్యాయవ్యవస్థ, జాతీయ మీడియా అవినీతి కూపాన్ని బయటకు లాగాయి.
సంకీర్ణధర్మం అంటూ మన ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ వేదాలు వల్లిస్తుంటే- రాజా, కనిమొళి, కల్మాడీ తదితరులు కోట్లు మేశారు. కర్ణాటకలోనూ ఇదే జరిగింది. కానీ అక్కడి లోకాయుక్త చేసిన మేలు వల్ల కొంత న్యాయం జరిగింది. అవినీతి యడ్యూరప్ప తన సీఎం కుర్చీని వదిలిపెట్టక తప్పలేదు. బలమైన లోకాయుక్త, లోకపాల్‌ వ్యవస్థలు ఉంటే రాష్త్రాలు, దేశం అవినీతి కోరల నుంచి బయటపడతాయి.

లోకపాల్‌ చట్టం పరిధిలోకి ప్రధాని మంత్రేకాదు న్యాయవ్యవస్థ కూడా ఉండాలనేదే అన్నా హజారే డిమాండ్‌. అదే కేంద్రానికి, ఇతర జాతీయ పార్టీలకు నప్పడం లేదు. న్యాయవ్యవస్థకూ ఇటీవల కొందరు మచ్చతెచ్చారు. వారంతా లోకపాల్‌కు జవాబుదారులే. అసలు కొంతకాలంగా ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఏం చేస్తున్నారో అంతుబట్టడం లేదు. ఆయన కొందరి చేతిలో కీలుబొమ్మగా మారినట్టు స్పష్టమవుతోంది. కాకపోతే మరేమిటి, ఎంతో మేధావిగా పేరు తెచ్చుకున్న పీఎం- ఈరోజు తలదించుకోవాల్సిన దుస్థితి ఎందుకొచ్చింది? లోకపాల్‌ బిల్లు పరిధిలోకి ప్రధాని ఉండటంలో త ప్పులేదని ఆయన చెబుతున్నా, కాంగ్రెస్‌ పార్టీ పెద్దలు ఎందుకు జంకుతున్నారు? అంటే- ప్రధానికి ఏం చేసినా చెల్లుబాటు అవుతుందా?
నిజానికి గత వారం రోజులుగా భారతీయ మీడియాలో అన్నా వార్తలే. ఆయనకు మద్దతుగా దేశమంతా ర్యాలీలు. మొదట్లో లైట్‌ తీసుకున్న కేంద్రం ఇపుడు భయంతో వణికిపోతోంది. అన్నా తీసుకొచ్చిన విప్లవం చూసి పెద్దలు ఆందోళన చెందుతున్నారు. ఆయన్ను ఎలా లొంగదీసుకోవాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. తీహార్‌ జైలుకు పంపి నాలుక కర్చుకున్న కేంద్రం ఇపుడు అన్నా ముందు దోషిగా నిలబడింది. నిజంగానే దేశంలో ఇపుడు రెండో స్వాతంత్య్ర పోరాటం చేస్తోంది. అవినీతిని తరిమికొట్టే సమయం ఆసన్నమైంది.
ఇంక్విలాబ్‌ జిందాబాద్‌, అన్నా జిందాబాద్‌.  జైబోలో భారత్‌మాతాకీ జై!



Monday, May 16, 2011

GREAT INSPIRATION



నేల తల్లి తన ఇద్దరు ముద్దు బిడ్డలను తనలో విలీనం చేసుకుంది. ఒకరు మానవ హక్కుల కోసం గళం ఎత్తితే, మరొకరు రైతన్న కోసం నినదించారు. ఆ ఇద్దరు మహానుభావులను 24 గంటల తేడాలో మనల్ని శాశ్వతంగా
వదిలి వె ళ్లడం నన్ను తీవ్రంగా కలచి వేసింది.

మన తెలుగుబిడ్డ కాకతీయ యూనివర్సిటీ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ బుర్రా రాములు- ఎక్కడ హక్కులు భంగపడితే అక్కడ వాలేవారు. బడుగు వారి పక్షాన పోరాడేవారు. ట్రేడ్‌ యూనియన్లలోనూ, పౌరహక్కుల సంఘంలోనూ, తర్వాత మానవహక్కుల వేదికలోనూ ఆయన చేసిన సేవలు ఈ తరం వారికి ఆదర్శప్రాయం.




ఇక మహేంద్రసింగ్‌ తికాయత్‌ గురించి మన తెలుగువారికి చాలా తక్కువ తెలుసు. ఆయన అవిశ్రాంత రైతు పోరాట యోధుడు. ఉత్తర భారతంలో రైతాంగానికి ఆయన పెద్ద దిక్కుగా నిలిచారు. భారతీయ కిసాన్‌ యూనియన్‌ పక్షాన తికాయత్‌ చేసిన పోరాటం కారణంగా అన్నదాతకు ఎంతో మేలు జరిగింది. ఉత్తరప్రదేశ్‌ లోని ముజఫర్‌నగర్‌ జిల్లాకు చెందిన ఆయన చెరుకుకు మద్దతు ధర కల్పించాలని, భారమైన రుణాల మాఫీ కోసం, విద్యుత్‌ ఛార్జీల తగ్గింపు కోసం మహాధర్నాలు నిర్వహించి, కేంద్రాన్ని ఉక్కిరిబిక్కిరి చేశారు.

ఈ ఇద్దరు జన నేతలకు నా శ్రద్ధాంజలి...

Saturday, April 23, 2011

HEY BHAGAVAN







భగవాన్‌... సత్య సాయిబాబా...ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవం. ఆయన చేపట్టిన సేవా కార్యక్రమాలు, చేసిన ఆధ్యాత్మిక భోదనలు అనన్య సామాన్యమైనవి. ఆయన నిర్యాణం చెందారన్న వార్త భక్తులనే కాదు యావత్‌ మానవాళిని కదిలించేసింది. ఎందుకంటే- ఆయన చేసిన సేవా కార్యక్రమాలు అటువంటివి. ఉన్నత విద్య, సూపర్‌ స్పెషాలిటీ వైద్యం, మంచినీటి సదుపాయం అందుబాటులోకి తీసుకురావడం ఆయనకే సాధ్యమైంది. ప్రపంచ వ్యాప్తంగా ఎందరో గురువులు, మహిమాన్విత వ్యక్తులు ఉన్నారు. కానీ ఎవ్వరూ చేయని విధంగా,  ఈ సాయి చేయడం విశేషం. అందుకే నాకు విశ్వాసం లేకున్నా... ఆయన సేవాభావాన్ని ప్రేమించాను.


ఆయన మహిమల గురించి వినిపించే విమర్శలను నేను పట్టించుకోను... ఎందుకంటే- ఆయన సేవా కార్యక్రమాల ముందు- ఈ విమర్శలు నిలబడవు కాబట్టి. చివరకు బీబీసీ మీడియా కూడా బాబాను అప్రతిష్టపాలు చేయాలని ప్రయత్నించింది. నిత్యం తనను దర్శించుకునే భక్తులకు బాబా ప్రముఖంగా అయిదు సూత్రాలు భోదించారు. అవి- ప్రేమ, శాంతి, ధర్మం, సత్యం, అహింస... నిజంగా ఈ పదాలు వింటేనే నా మనసు పులకించిపోతుంది. వీటినే ఆధారంగా చేసుకుంటే మానవుని జీవితం ధన్యమవుతుందని బాబా చెప్పారు.


ఆయన భోదనల్లో నాకు నచ్చిన ప్రవచనం... నేను దేవుడిని, నీవు కూడా దేవుడివే, తేడా ఏమిటంటే, ఈ సంగతి నాకు తెలుసు, నీకు అసలు తెలియదు.

Saturday, April 2, 2011

SALUTE TO MEN IN BLUE



యస్‌... ఇండియా రాక్స్‌... ఈ పదాలు రాస్తుంటే నా శరీరం పులకిస్తుంది. నా మనసు పరవశిస్తుంది. నా శ్వాస జయహో అంటోంది. అవును. ఎన్నాళ్లకెన్నాళ్లకు మన క్రికెట్‌ వీరులు మళ్లీ జగజ్జేతలయ్యారు. ఫైనల్లో మనం గెలుస్తామని నాకు ఎంతో ధీమా ఉంది. ఎందుకంటే- బ్యాటింగ్‌లో అద్భుతమైన ఆటతీరును కనబరుస్తున్న మన  ఆటగాళ్లు...నాకౌట్‌లోకి ప్రవేశించేసరికి జగదేకవీరుడి వలె ప్రత్యర్థిని చిత్తుచేశారు. బౌలర్లు చెలరేగితే, ఫీల్డర్లు మైదానంలో పాదరసంలా జారారు. మనవాళ్లు పులిలా వేటాడుతుంటే ప్రత్యర్థులు జింక పిల్లల్లా చెల్లాచెదురయ్యారు. ఫైనల్‌ ప్రత్యర్థి శ్రీలంక మనతో సమఉజ్జీగా నిలిచే జట్టే కానీ, 275 పరుగుల విజయలక్ష్యం మనవారికి చాలా చిన్నది. ఎందుకంటే- పిచ్‌లో బౌలర్లకు పెద్దగా ఏమీ లేదు. కాబట్టే నేను ధీమాగా ఉన్నాను. అందరికీ ఇండియాదే ట్రోఫీ అని చెప్పాను. అదే నిజమైంది. ఆ తర్వాత భారతావని జనసంద్రంగా మారింది. అందరూ వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. మిఠాయిలు పంచుకున్నారు. బాణాసంచా కాల్చారు. మా ఇంట్లోనూ పిల్లలు దీపావళి జరిపారు.






ఇవన్నీ చూస్తుంటే నాకు చిన్ననాటి తీపి జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి. 1983 జూన్‌ 25వ తేదీ నాకు బాగా గుర్తు. కలర్‌ టీవీలు అప్పుడప్పుడే వచ్చాయి. ఆ నాటి భారత్‌-వెస్టిండీస్‌ టైటిల్‌ ఫైట్‌ను నేను కళ్లారా చూశాను. ఇండియా విక్టరీ ఘడియలను బీబీసీ రేడియోలో ప్రత్యక్ష వ్యాఖ్యానం ద్వారా విని ఉబ్బితబ్బిబ్బయ్యాను. ఒక్కో విండీస్‌ వికెట్‌ నేలకూలుతుంటే- నేను ఉద్వేగంతో కేరింతలు కొట్టాను. నాకోసం నా తండ్రి కూడా మేల్కొన్నారు. నన్ను ఉత్సాహపరిచారు. ఆ రోజు లార్డ్స్‌ మైదానం ఇండియా ఫ్యాన్స్‌తో నిండిపోయింది. ఇండియాలోనూ అందరూ ఇళ్లలోనే సంబరాలు చేసుకున్నారు.

Saturday, March 19, 2011

POLITICS & MONEY





ఏ ముహుర్తంలో ఈ దేశానికి ఫ్రీడం వచ్చిందో గాని, అంతా అవినీతిమయం అయిపోయింది. అన్ని వ్యవస్థలు భ్రష్టుపట్టిపోతున్నాయి. ఒకప్పుడు పనిచేస్తేనే లంచం తీసుకునేవాళ్లు. ఇపుడు పనిచేయకపోయినా... డబ్బులు దండుకుంటున్నారు. స్కీముల పేరు చెప్పి- దొరికినకాడికి దోచుకుంటున్నారు. అడిగే నాథుడే లేడు. ఎందుకంటే- అందరి నోళ్లు డబ్బు మూయిస్తోంది కాబట్టి.


వికీ లీక్స్‌ తీగల దుమారం రెండురోజులుగా పార్లమెంట్‌ను కుదిపేస్తోంది. ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నాయి. ఈ అవకాశాన్ని తమకు అనుకూలం చేసుకోవాలని పాపం కమలనాథులు విఫలయత్నం చేస్తున్నారు. వారు అధికారంలో ఉండగా ఏం జరిగిందో అందరికీ తెలుసు. ఏ పార్టీని, ఏ నాయకున్ని నమ్మే రోజులు కావు ఇవి.


తమిళనాడులో ఎన్నికలకు ముందే అవినీతి కంపు కొడుతోంది. కోట్లాది రూపాయలు పంచిపెడుతున్నారు. నానారకాల స్కీములు ప్రవేశపెట్టి- ఓటర్లను మభ్యపెడుతున్నారు. ఇది ఒకందుకు మంచిదే. ఇన్నాళ్లపాటు పేదల కడుపుకొట్టి దోచుకున్న ధనం మళ్లీ పేదల చెంతకే వెళ్లడం ఒక మంచి పరిణామమే. కానీ ఇలా గెలిచిన వాళ్లు మళ్లీ జనంపై విరుచుకుపడతారు. ఖజానా లూటీ చేస్తారు. అపుడు నిలదీసే హక్కు ప్రజలకు ఉండదు.


తాజాగా, మన రాష్ట్రంలో జరిగిన MLC ఎన్నికలు- అన్ని పార్టీలలో కలకలం రేపాయి. ముఖ్యంగా KCRకు ఈ ఎన్నికలు మంచి గుణపాఠమే నేర్పాయి. ఏదో తల్చుకుంటే- ఏదో జరిగింది. ముగ్గురు ఎమ్మెల్యేలు క్రాస్‌ఓటింగ్‌ చేశారన్న వార్త కొందర్ని నిశ్చేష్టపరిచింది. అధినేతకు తెలిసే జరిగిందని కొందరు, లేదని కొందరు వాదిస్తున్నారు. మొత్తం మీద ముగ్గురిపై సస్పెన్షన్‌ వేటుతో కేసీఆర్‌ తనపై అనుమానాలను కొంతమేరకు తగ్గించగలిగారు.

Saturday, March 5, 2011

EXAM TIME



ఇది పరీక్షల సమయం. నిజంగానే కేవలం విద్యార్థులకే కాదు- రాజకీయ నేతలకు, రాజకీయ పక్షాలకు. ఇంకా చెప్పాలంటే, కేంద్ర -రాష్త్ర ప్రభుత్వాలకు కూడా. ఎందుకంటే- పిల్లలైతే చదువుకుంటారు. పరీక్షలు రాస్తారు. కానీ రాజకీయ నాయకులకు చదువులతో పనిలేదు. వారికి తెలిసిందల్లా రాజకీయాలు చేయడమే. అవకాశం దొరికితే- విద్యార్థుల్ని సైతం పావుగా వాడుకోవడమే. వారి భావోద్వేగాలకు వందల మంది విద్యార్థులు బలపీటమెక్కారు. కానీ రాజకీయ నేతలు మాత్రం కుటిలయత్నాలు మానడం లేదు. విశ్వాసం నెలకొల్పే చర్యలు చేపట్టడం లేదు. ప్రభుత్వం కూడా అలాగే ఉంది.

ఇపుడు రాష్ట్ర ప్రజలను పదో తేదీ వణికిస్తోంది. ముఖ్యంగా రాజధానిలో నివసించే వారికి ఇది ఎక్కువగా ఉంది. ఆరోజు ఏం జరుగుతుందోనని అంతా ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా దశాబ్దాలకిందట వలసవచ్చిన ఆంధ్ర సోదరులను ఈ పరిణామాలు భయాందోళన కలిగిస్తున్నాయి. వారికేం జరగదని, వారిజోలికి వెళ్లమని రాజకీయ ఐకాస స్పష్టంగా ప్రకటించాలి. అపుడే మిలియన్‌ మార్చ్‌ అర్థమంతమవుతుంది.

ఇక విద్యార్థుల విషయానికొస్తే- అంతా అయోమయం, గందరగోళం. ప్రభుత్వం పట్టుదలకు పోతే- పరిస్థితి ఏంటి? పదో తేదీ సీనియర్‌ ఇంటర్‌ ఇంగ్లీష్‌ పరీక్ష ఉంది. అది రాయడానికి లక్షలాది మంది స్టూడెంట్స్‌ ఎదురుచూస్తున్నారు. పోలీస్‌ పహారాలో పరీక్షలు రాసే పరిస్థితి రాకూడదు. రెండు పక్షాలు పట్టువిడుపులకు సిద్ధంగా ఉండాలి. పిల్లలకు ఇంటర్‌ పరీక్షలు ఎంతో కీలకం. వారి లైఫ్‌లో ఈ పరీక్షలు టర్నింగ్‌పాయింట్‌. వారిని ధైర్యంగా పరీక్షలు రాయనిద్దాం.

భవిష్యత్‌ తెలంగాణ వారికోసమే అన్నప్పడు, భవిష్యత్‌ విద్యార్థులకు ఏం నష్టం వాటిల్లకుండా జాగ్రత్తపడదాం. ప్రభుత్వం కూడా పంతానికి పోకుండా పదో తేదీన పరీక్షను వాయిదా వేస్తే- పిల్లలు, వారి తల్లిదండ్రులు కాస్త ఊపిరిపీల్చుకుంటారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని కేంద్ర సర్కార్‌, కాంగ్రెస్‌ హైకమాండ్‌లు సూచనప్రాయంగా చెబుతున్నాయ్‌ కాబట్టి- హైదరాబాద్‌లో జరగబోయే పరీక్షల నిర్వహణకు అన్ని రాజకీయ పక్షాలు అనుకూల వాతావరణాన్ని కల్పించాలి.

Monday, February 28, 2011

My Telangana


జై తెలంగాణ... ఈ పదాన్ని ఉచ్చరించడానికి ఒక ప్పుడు వెనుకంజ వేసిన వాళ్లంతా ఇపుడు నినదిస్తున్నరు. ఇపుడు తెలంగాణ పల్లెపల్లెల్లో వినిపిస్తున్నది ఈ నినాదమే. పార్టీలు అక్కర్లేదు, నాయకులు అక్కర్లేదు, జెండాలు అక్కర్లేదు, అజెండాలు అక్కర్లేదు. ఇపుడు అంతా ఒకే గొంతుకై తెలంగాణ స్వాతంత్య్రానికి పోరాడుతున్నరు.

ఇన్నాళ్లుగా రాజకీయ పార్టీలు, రాజకీయ నేతలు, ప్రజలను తమ స్వార్థ ప్రయోజనాలకు వాడుకున్నరు. ఇక వారి కుటిలనీతి సాగదు. వారి దుష్టపన్నాగాలు సాగవు. ఇపుడు జై తెలంగాణ నినాదం ప్రజలది. నాలుగు కోట్ల తెలంగాణ బిడ్డలది. మన కోస్తాంధ్ర సోదరులు, ఉత్తరాంధ్ర సోదరులు, రాయలసీమ సోదరులు ఇది అర్థం చేసుకుంటున్నరు. కానీ అక్కడి నేతలు కొందరు దీన్ని భూతద్దంలో చూపించి- ఎప్పటిలాగే- తెలంగాణ ప్రజలను, తెలంగాణ ప్రాంతాన్ని దోచుకోవాలని కుట్రపన్నుతున్నరు.

ఇది 1969 కాదు, ప్రజలు మళ్లీ మోసపోవడానికి. చెన్నారెడ్డిని ఆనాడు అత్యధిక లోకసభ స్థానాలు గెల్చుకున్న తెలంగాణ ప్రజాసమితిని కేంద్రం పెద్దలు మాయమాటలు చెప్పి, మోసం చేసి ఉండవచ్చు. ఈనాడు కూడా కేసీఆర్‌ను, తెలంగాణ రాష్ట్రసమితిని మరోసారి మోసం చేసే ఆలోచనలో సీమాంధ్ర నేతలు, అటు ఢిల్లీ పెద్దలు కుట్ర చేస్తూ ఉండవచ్చు. కానీ నాలుగు కోట్ల తెలంగాణ గొంతుకలను ఆపలేరు. డబ్బులతో, లాలూచీతో ఏదో చేయాలనుకుంటే- మొదటికే మోసం వస్తుంది. ఉద్యమం అంతకంతకూ తీవ్ర రూపం దాలుస్తుంది. ఆ స్థితిని తీసుకురావద్దని నా మనవి.

మొన్న 48 గంటల దిగ్భందనానికే చాలామందికి విసుగుపుట్టింది. తెలంగాణపై కేంద్ర నాన్చుడు వైఖరిని అటు సమైక్యాంధ్రులే కాదు తటస్థులు కూడా తప్పుబట్టారు. ఇపుడు రైల్‌రోకో, ఈనెల ౧౦న మిలియన్‌ మార్చ్‌లు ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లతాయి. సోనియా, మన్మోహన్‌లే కాదు ఆంధ్ర, రాయలసీమ ప్రజాప్రతినిధులు ఇలాంటి వైఖరినే కొనసాగిస్తే- మున్ముందు ఉద్యమం మరింత తీవ్రరూపం దాలుస్తుంది. కొందరు స్వార్థరాజకీయ నాయకుల కోసం తెలుగు సోదరులు పోట్లాడుకోవాలా? తప్పు తప్పు. తెలంగాణ ఉద్యమ ప్రభంజనంలో కుటిల రాజకీయ నేతలు కొట్టుకుపోయే రోజు ఎంతో దూరంలో లేదు.

Saturday, February 26, 2011

CHILDREN POETS


నిజంగానే- వారిద్దరు మహనీయులు. ఇద్దరూ వారి రచనలతో ప్రజలను రంజింపజేశారు. ఒకరు అనంత్‌ పాయ్‌, రెండోవారు ముళ్లపూడి. కొద్దిగంటల తేడాలో ఇద్దరూ మరణించడం చాలా ఆవేదనకు గురిచేసంది.


అంకుల్‌ పాయ్‌గా చిరపరిచితుడైన అనంత్‌- తన కామిక్స్‌తో ఓ విప్లవానికి నాంది పలికారు. ఆయన రచించిన అమర్‌చిత్రకథలు- అన్ని భాషల్లోకి అనువదించారు. తద్వారా పిల్లలకు మన ప్రాచీన, పౌరాణిక, ఆధ్యాత్మిక, చరిత్రాత్మక విశేషాలన్నీ తెలిశాయి. చక్కటి బొమ్మలతో, అర్థమయ్యే పదజాలంతో ఆయన రచనలు గొప్ప ఖ్యాతినార్జించాయి. దూరదర్శన్‌  ఏర్పాటు చేసిన ఓ క్విజ్‌ కార్యక్రమంలో పిల్లలకు భారత పురాణాల పట్ల ఎలాంటి అవగాహన లేదని తెలుసుకున్న ఆయన అమర్‌ చిత్ర కథలకు పూనుకోవడం చిన్నారులు చేసుకున్న భాగ్యం అనుకోవాలి. అలాగే టింకిల్‌ పేరిట పిల్లల కోసమే మరో కామిక్స్‌ సిరీస్‌ను ఆరంభించారు. ఈ రెండు దేశంలో ఎంతో ప్రసిద్ధిగాంచాయి.



ఇక మన ముళ్లపూడి గురించి నేను ఏం చెప్పగలను. బాపు-రమణలది విడదీయరాని జంటగా ఉండేది. ఒకరు శరీరమైతే- మరొకరు ఆత్మగా ఉండేవారు. ఆయన సాహిత్యంలో అన్నీ ఉండేవి. సినిమా కథలు, నవలలు, హాస్యరచనలు, సంభాషణలు... ఇలా అన్ని వర్గాల వారికి కావల్సినంత విందును, వినోదాన్ని పంచిపెట్టారాయన. సినిమాలలో ఆయన రచనా శైలిని మెచ్చుకోని వారు లేరు. ముత్యాలముగ్గులోని డైలాగ్స్‌- ఇప్పటికీ గుర్తున్నాయి. బుడుగు హాస్యరచనలు ముళ్లపూడికి ఎంతో పేరు తెచ్చిపెట్టాయి. చిన్నారులను అలరించాయి. అంకుల్‌ పాయ్‌లాగే రమణ కూడా పిల్లల కోసం ఎంతో శ్రద్ధతో రచనలు చేసేవారు. పిల్లల కోసం ఆలోచించిన ఇద్దరు మహనీయులు మనమధ్య నుంచి వెళ్లిపోవడం బాల్యప్రపంచానికి తీరని లోటు.

Thursday, February 17, 2011

IAS POLITICIAN


ఏదైతే జరగవద్దని... ఇన్నాళ్లుగా అనుకున్నానో... అదే జరిగింది. తెలంగాణ వాదిగా- ఉద్యమం శాంతియుతంగా జరగాలిని, సీమాంధ్ర సోదరుల అంగీకారం, సహకారంతోనే విడిపోవాలని కోరుకున్న వాళ్లలో నేనూ ఒక న్ని. కానీ... అసెంబ్లీ సాక్షిగా- కాంగ్రెస్‌ కుటిల రాజకీయాల సాక్షిగా దురద్రుష్టకరమైన సంఘటన జరిగే పోయింది. తెలంగాణ వాదాన్ని ఎప్పుడూ కించపరిచే మాజీ ఐ.ఎ.ఎస్‌. అధికారి- తాజా రాజకీయాలు అంటే పూర్తిగా అవగాహన లేని జేపీపై దాడి జరిగింది. ఓ ప్రజాస్వామ్యవాదిగా, ఓ శాంతికాముకుడిగా నేను ఆ దాడిని ఖండిస్తాను. కానీ జేపీ చేసిందేమిటి? అప్పటికే- అసెంబ్లీ లోపల మార్షల్స్‌చే గెంటివేయబడిన టి.ఆర్‌.ఎస్‌. ఎమ్మెల్యేలు ఎదురుగా ఉన్నప్పటికీ- లెక్కచేయకుండా, మీడియా ముందు అనవసర విషయాలను ప్రస్తావించడంతో- TRS శాసనసభ్యులు తమను తాము నియంత్రించుకోలేకపోయారు. దాని ఫలితమే ఆ దాడి.

అయితే- శాసనసభలో ఎన్నో పార్టీలున్నాయి. ఎందరో సీనియర్‌ శాసనసభ్యులున్నారు. తెలంగాణ వ్యతిరేక పార్టీలున్నాయి. కానీ ఎవ్వరికీ లేని అభ్యంతరాలు కేవలం జేపీకే ఉండటం కూడా అర్థంకానిది. అంతా వ్యూహాత్మకంగా పోతుంటే- లోకసత్తా నేత జయప్రకాశ్‌నారాయణ్‌ మాత్రం మీడియా పాయింట్‌ వద్ద ఇష్టానుసారంగా మాట్లాడి టి.ఆర్‌.ఎస్‌. ఎమ్మెల్యేలను రెచ్చగొట్టారు. దాని ఫలితమే ఈ దాడి.

జేపీ లాంటి నేతలు- కాంగ్రెస్‌ సభ్యులను చూసి చాలా నేర్చుకోవాలి. గవర్నర్‌ ప్రసంగం, టి.ఆర్‌.ఎస్‌, టీడీపీ వ్యూహాలకు జడిసి- ఢిల్లీలోనే దాచుకున్న కాంగ్రెస్‌ శాసనసభ్యులను చూసి జేపీ చాలా నేర్చుకోవాలి. ఎక్కడ తెలంగాణ వాదానికి మద్దతు ప్రకటించాల్సి వస్తుందన్న భయంతో కాంగ్రెస్‌ తెలంగాణ నేతలు- ఏపీ భవన్‌లోనే మకాం వేస్తే- ఇక్కడ జేపీ లాంటి వారు కాంగ్రెస్‌ చేతిలో పావుగా మారారు.

SORRY PM



ఇటీవల కాలంలో ఎలక్ట్రానిక్‌ మీడియాలో వస్తున్న కుంభకోణాల శరపరంపరను తిప్పికొట్టడానికి అన్నట్టుగా దేశ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ప్రముఖ టెలివిజన్‌ ఛానెళ్ల ఎడిటర్లతో ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కానీ ఆర్థికరంగంలో తలపండిపోయిన మన్మోహన్‌ జీ- ఇంకా రాజకీయంలో ఎదగలేదని ఆయన వైఖరి స్పష్టమైంది. నిజమే- ఒక ఆర్థిక వేత్త, నిజాయితీపరుడికి రాజకీయం చేతకాదు. సొంతపక్షం చేతిలో కీలుబొమ్మగా మారిన మన్మోహన్‌- అటు సంకీర్ణంలోని భాగస్వామ్యపక్షాలనూ అదుపు చేయడంలో విఫలమవుతున్నారు. అదే- ఇపుడు దేశం పాలిట, ప్రజల పాలిట శాపమైంది.

ఎడిటర్లు సంధించిన ప్రశ్నలకు ప్రధాని జవాబు చెప్పలేక నీళ్లు నమలాల్సి వచ్చింది. టీవీలో మీడియా కాన్ఫరెన్స్‌ను చూసినవారికి ఇది గుర్తే ఉంటుంది CNN-IBN బాస్‌ రాజ్‌దీప్‌ సర్‌దేశాయ్‌ అడిగిన ప్రశ్నకు మన్మోహన్‌ నీళ్లు తాగాల్సి వచ్చింది. తన వల్ల తప్పులు జరుగుతున్నాయని అంగీకరించిన ప్రధాని- మొత్తం అవినీతికి తానే దోషిని అంటే కరెక్ట్‌ కాదన్నారు. మీడియా అత్యుత్సాహం వల్ల- మొత్తం భారతావని అవినీతి కూపంగా మారిందన్న అభిప్రాయం కల్పించే యత్నం కలుగుతోందని వాపోయారు. యూపీఎ-2 హయాంలో వెలుగులోకి వచ్చిన కుంభకోణాలను ప్రస్తావిస్తూ- అంతా పారదర్శకంగానే జరిగినట్టు తనవారిని వెనకేసుకొచ్చారు.

అసలు ప్రధాని ఏం చెప్పదల్చుకున్నారు? సంకీర్ణ సర్కారు ఉంటే- అవినీతి జరుగుతుందా? కళ్ల ముందే వేల కోట్లు ఎగరేసుకుపోతున్నా మన నిఘా సంస్థలు కళ్లు మూసుకోవాలా? ప్రభుత్వానికి ఇబ్బంది రావద్దు కాని- ప్రజల సొమ్ము లూటీ కావ ల్సిందేనా? ఇదేం న్యాయం? ఎవడబ్బసొమ్మని ఈ రాజకీయ రాబందులు- లాబీయిస్టులు, పారిశ్రామికవేత్తల  వైట్‌ కాలర్‌ నేరాలు జరగాల్సిందేనా? కొంతమంది ఘనులు ఈ దేశాన్ని దోచుకుంటే మనం చూస్తూ ఉండిపోవాల్సిందేనా?  I PITY MY COUNTRY.

Tuesday, February 15, 2011

SAVE INDIA




భారతదేశం గొప్ప సంపన్నదేశం. అందుకే శతాబ్దాలుగా ఇది దోపిడీకి గురవుతోంది. ఇక్కడి ప్రజలు కూడా శాంతి కాముకులే. ఇక్కడి ప్రజలకు పరమత సహనం, ప్రేమ, ఆప్యాయతలు కూడా ఎక్కువే. అందుకే ఎక్కడివాడో వచ్చి మనల్ని నిలువునా దోచుకుంటున్నాడు. ఇలా ఎంత కాలం? మనం ఎప్పుడూ ఇలా నష్టపోవాల్సిందేనా? ఈ దోపిడీ రాజ్యం ఆంగ్లేయులతోనే అంతరించి పోతుందని ఆశపడినా... లాభం లేకుండా పోయింది.

ఇంగ్లీషోల్లు మిగిల్చింది ఊడ్చేయడానికి మన నల్లదొరలు బతికే ఉండటం మనం చేసుకున్న పాపం. గాంధీజీ కలలుగన్న శ్రీరామరాజ్యం కల్లలుగానే ఉండిపోయింది. రాజకీయ వ్యవస్థ దగ్గర్నుంచి శాసన వ్యవస్థ, న్యాయవ్యవస్థలు పూర్తిగా భ్రష్టుపట్టిపోయాయి. వారికి మీడియా కూడా వంతపాడుతోంది. అందుకే ఇండియా ఇలా దాపురించింది.

అప్పట్లో చిన్నపాటి అవినీతి జరిగితే- ఎంతో నిరసన వ్యక్తమయ్యేది. ఇపుడు వేలు కాదు, లక్షలు కాదు, కోట్లు కాదు... ఏకంగా వందల కోట్లు, వేల కోట్లు, లక్షల కోట్లు మేస్తున్నారు. దేశాన్ని ఏలుతున్న వారే- దేశసంపదను కొల్లగొడుతుంటే- మనం నిశ్చేష్ఠులై ఉండిపోతున్నాం. ఎందుకిలా జరుగుతోంది. ఎంతకాలం ఇలా భరించాలి. అధికారం ఉన్నోడు- దొరలా దోచుకోవాల్సిందేనా? పేదరికంలో మగ్గినోడు- పాపర్‌గా మిగిలిపోవాల్సిందేనా?

ఇంకెన్నాళ్లు... ఈ దోపిడీ రాజ్యం... ఇంకెన్నాళ్లు భరించాలి... ఈ దోపిడీదొంగల్ని. మనం ఉప్పు కారం తినట్లేదా? మనలో చేవ తగ్గిపోతోందా? మన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఐ.ఎ.ఎస్‌.లు, ఐ.పి.ఎస్‌.లు, న్యాయాధికారులు, ఇతర ప్రభుత్వ ఉద్యోగుల అవినీతికి అడ్డులేదా? ఇకనైనా మనం ఈజిప్టు సోదరులనుంచి ఏమైనా నేర్చుకుంటామా? హే రామ్‌! నా దేశాన్ని రక్షించు... ఈ రాబందుల నుంచి... ఈ దోపిడీగాళ్ల నుంచి... SAVE INDIA.

Thursday, February 10, 2011

స్కాముల సర్కారు...


.

యూపీఏ-2 ప్రభుత్వం నిజంగానే- మన్మోహన్‌ సింగ్‌ లాంటి మేధావికి చేటు తెచ్చింది. చిన్నాచితకా భాగస్వామ్యపార్టీలతో సర్కారు ఏర్పాటు చేయడం వల్ల- మన ప్రధాని మౌనంగా అన్నీ భరిస్తున్నారు. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న అవినీతి భాగోతం- ఆయనకు తెలిసే జరుగుతోందని కొంద రు, ఆయనకు సంబంధం లేదని ఇంకొందరు వాదించవచ్చు గాక... కానీ ప్రధానమంత్రికి తెలిసి జరిగినా... తెలియక జరిగినా... ఇండియాలో ప్రస్తుతం స్థితి ఏమంత బాగోలేదు. ప్రధాన మంత్రి కార్యాలయం, నిఘా సంస్థలు, రాజకీయ పార్టీలు, శాసనకర్తలు, ఎగ్జిక్యూటివ్‌... వగైరా వగైరా! కానీ ఏం లాభం జరగాల్సిన నష్టం జరిగిపోయింది. 2జీ స్కాం, 3జీ స్కాం, లేటెస్ట్‌గా 4జీ స్కామ్‌... ఇదంతా ప్రభుత్వ అవినీతిని ఎత్తిచూపుతున్నాయి.

ఇక, సోనియా జీ అంతరంగం ఏమిటో అంతుబట్టడం లేదు. ఆమె తన కొడుకు రాహుల్‌ను ఒకవైపు ప్రధాని చేయాలని కలలు కంటున్నారు. కానీ యూపీఏ-2 ప్రభుత్వాన్ని మాత్రం అవినీతికూపం నుంచి బయటపడవేయలేకపోతున్నారు. కామన్‌వెల్త్‌ గేమ్స్‌, ఆదర్శ్‌ కుంభకోణాలు మీడియా చలవతోనే బయటపడ్డాయి.

నాకు అనిపిస్తుంది... భారతంలో సమర్థులైన జర్నలిస్టులు లేకపోతే- ఈ నేతలు, అధికారులు కలిసి- ఇండియానే స్విస్‌ బ్యాంకులో తాకట్టు పెట్టేవారేమో?    LONG LIVE JOURNALISM.

Monday, January 31, 2011

ఎవరిని నమ్మాలి...



నిజమే... తెలంగాణ విషయంలో ఎవ రిని నమ్మాలో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. ఎందుకంటే- ఆ ప్రాంతంలోని ప్రతి పార్టీ తెలంగాణ అంశం గురించి మాట్లాడుతోంది. దాన్ని ఏర్పాటును సమర్థిస్తోంది. ప్రత్యేక రాష్త్రం ఏర్పాటు కోసమే తెరపైకి వచ్చిన TRS పార్టీ ఇపుడు మరింత దూకుడుగా వెళ్తోంది. పనిలోపనిగా పార్టీ పునాదులను బలోపేతం చేసుకుంటోంది. అందుకే ఇతర పార్టీల దిగువస్థాయి నేతలను పెద్ద ఎత్తున పార్టీలోకి చేర్చుకుంటోంది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా... 50 అసెంబ్లీ, 10 ఎంపీ స్థానాలు గెలవడం కోసం KCR పక్కా ప్లాన్‌ చేస్తున్నారు.

మరోవైపు- అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీతోపాటు... ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీలు ఈ విషయంలో తెలంగాణవాదులను తికమకపెడుతున్నాయి. రెండు నాల్కల ధోరణి అవలంభిస్తూ- సమస్యను జటిలం చేస్తున్నాయి. ఒకరిపై ఒకరు బురద జల్లుకుంటు ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నాయి. కాంగ్రెస్‌ పార్టీలో మంత్రులు, ఎంపీలు ఎవరికివారే పోటీ సమావేశాలు పెట్టుకుంటున్నారు. పాపం... ప్రజలు ఇది గమనిస్తున్నారని వారికి తెలయదనుకుంటా.

ఇక వామపక్షలు ఎటూ తేల్చుకోలేకపోతున్నాయి. రెండు పార్టీలది చెరోదారి.  మజ్లిస్‌ పార్టీలో ఇంకా క్లారిటీ రాలేదు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను సపోర్ట్‌ చేస్తే ఏం లాభం... చేయకపోతే ఏం నష్టమో తేల్చుకోలేని పరిస్థితిలో MIM నేతలున్నారు. తెలంగాణకు మద్దతు ప్రకటించిన బీజేపీ రాజకీయ ప్రయోజనాలకే పెద్దపీట వేస్తూ- ప్రాంతీయత త్వాన్ని సొమ్ముచేసుకోవాలని ఆశపడుతోంది. లోకసత్తా అసలు పార్టే కాదు...

పాపం... చిరంజీవికి సరైన మార్గదర్శకత్వమే కరవైంది. ఎట్లాగూ పార్టీ పోయింది... ఇపుడు సినిమాలూ పోతున్నాయ్‌... అందుకేనేమో... అధికార పార్టీకి అనుకూలంగా మసులుతున్నారు. మేడమ్‌ను కలుస్తున్నారు. పీఎం కూడా అపాయింట్‌మెంట్‌ ఇచ్చేస్తున్నారు. కాంగ్రెస్‌ కూడా చిరు సంకటస్థితిని వాడుకుంటోంది.  జగన్మోహన్‌రెడ్డి  నుంచి పొంచి ఉన్న ప్రమాదాన్ని ద్రుష్టిలో పెట్టుకునే కాంగ్రెస్‌ హైకమాండ్‌ ఈ వ్యూహాన్ని అనుసరిస్తోంది అని చిన్న పిల్లాడిని అడిగినా తెలుస్తుంది.

Tuesday, January 25, 2011

SACHIN- BHARAT RATNA




ఒక్క భారత దేశమే కాదు... యావత్‌ క్రీడాలోకం వేయికళ్లతో ఎదురుచూసింది. క్రికెట్‌ మాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ను భారత రత్న వరిస్తుందా లేదా అని. కానీ మన ప్రభుత్వం ఈసారి కూడా ఎందుకనో వెనుకంజవేసింది. ఈనాడు, ఒక్క క్రీడాప్రపంచమే కాదు- రాజకీయ, సామాజికవర్గాలే కాదు అందరూ కూడా సచిన్‌కు భారత రత్న ఇవ్వాలని ఆకాంక్షించారు. అందరి ఉత్సాహం నీరుగారిపోయింది. అసలు మన పాలకుల అంతర్యం ఏమిటో ఒక్క పట్టాన అర్థం కాలేదు. ఎందుకు ఇవ్వలేదో వారికే తెలియాలి. సచిన్‌ వయసు చూసి, అపుడే ఏం తొందర అని అనుకుంటున్నారా? లేకపోతే మరేమిటి! అతని ప్రతిభను చూసి సత్కరించండి. గత 21 సంవత్సరాలుగా క్రికెట్‌ రంగంలో అతని రికార్డులు చూడండి. ఒక్క ఆటలోనే కాదు... భారత క్రీడారంగానికి అతను నిలువెత్తు ఆదర్శం. అతని పేరు చెబితేనే ప్రతి క్రీడాకారుడు గర్వంతో తలపైకి ఎత్తుతాడు. అతని సేవానిరతి, సామాజిక బాధ్యత కూడా చూడండి.. ఎవ్వరికి తీసిపోని దయాగుణం సచిన్‌ టెండూల్కర్‌ది... కేంద్రం ఇచ్చినా ఇవ్వకపోయినా... మాకు మాత్రం సచిన్‌ ఎప్పటికీ భారత రత్నే...

Sunday, January 23, 2011

BLACK MONEY



ఎవడబ్బ సొమ్ము...
నల్లధనం... నల్లధనం... ఇపుడు ఎవ్వరి నోట విన్నా ఇదే మాట! ఎవ్వర్ని కదిపినా... దీని గురించిన చర్చలే వినిపిస్తాయి. అంతలా మన రాజకీయ రాబందులు దేశాన్ని దోచుకున్నాయి. కాదు కాదు... బడుగు బలహీనవర్గాల పొట్టగొట్టి ప్రజాధనాన్ని సరిహద్దులు దాటించాయి. దీని గురించి రాజకీయ పక్షాలు పెద్దగా మాట్లాడవు. ఎందుకంటే- అందరూ ఒక్కతాను ముక్కలే కదా! ఇప్పటికైనా మించిపోయింది లేదు. స్విస్‌ ప్రభుత్వాన్ని ఒప్పిస్తారో... గంగలో దూకుతారో తెలియదు కానీ... మన డబ్బు మనకు చెందాలి. ఎవరో అన్నారు. స్వాతంత్య్రం రాకమునుపే ఈ నల్లధనం విదేశాలకు వెళ్లడం ఆరంభమయిందట. ఉండవచ్చు.

దేశంలోని బడాబాబులు ఎవరైతే ఉన్నారో... వారంతా దొరికింది దొరికినట్టు దోచుకున్నారు. దేశాన్ని సర్వనాశనం చేశారు. వారికి శాసనవ్యవస్థ, న్యాయవ్యవస్థలు అండదండగా ఉండటంతో- ఆడిందే ఆట... పాడిందే పాట అయ్యింది. 20 లక్షల కోట్లు కాదు... దానికి ఎన్నో రేట్ల నల్లధనం దేశం దాటివెళ్లిపోయింది. సుప్రీంకోర్టు చురకలు వేసినా... కేంద్రంలో ఉలుకు పలుకు లేదు. అంతర్జాతీయ ఒప్పందాల మేరకు, పేర్లు బయటపెట్టడం సాధ్యం కాదని స్వయంగా ప్రధాని ప్రకటించడం సిగ్గుచేటు కాక మరేమిటి?

Saturday, January 8, 2011

Thirsty Sachin

సచిన్ బాగా ఆడుతున్నాడు. అతని కెరీర్లోనే ఇది అద్బుతమైన సమయం. గత ఏడాదిగా అతను చాల నిలకడగా ఆడుతున్నాడు. సెంచురిల మీద సెంచురీలు కొడుతున్నాడు. ఎన్ని చేసినా ఇంకా సంతృప్తి లేదంటున్నాడు. హాపీగా ఉన్నా సంతృప్తిగా లేదంటున్నాడు. తాజా ర్యాంకింగ్స్లో సచిన్ 883 పాయింట్లతో ఉమ్మడిగా నెంబర్ వన్ ప్లేస్లో ఉన్నాడు.

సఫారి టూర్లో మాస్టర్ ఇరగదీసాడు. రెండు శతకాలతో తన సత్తా ఏమిటో చాటిచెప్పాడు. ముఖ్యంగా యాబ్బయ్యో సెంచురీ చాల స్పెషల్. ఈ ఏడాది ఫెబ్రవరిలో జరిగే వరల్డ్ కప్లో ట్రోఫి గెలవాలని సచిన్ టార్గెట్.

అతని కోరిక తీరాలని మనమూ కోరుకుందాం... ఆల్ ది బెస్ట్ సచిన్.