Saturday, June 23, 2012

Tennis

Paes-Bhupathi Controversy


టెన్నిస్‌ పెద్దల నిర్వాకం... భారతదేశానికి  ఒలింపిక్‌ మెడల్‌ను దూరం చేస్తోంది. ఇద్దరు అగ్రశ్రేణి క్రీడాకారుల తగాదా... మనస్పర్థలు.. భారత క్రీడారంగంలో పెద్ద దుమారాన్నే లేపాయి. ఒకవైపు చూస్తే... లియాండర్‌ పేస్‌... రెండోవైపున మహేశ్‌ భూపతి.! ఇద్దరూ నిస్పందేహంగా టాప్‌ డబుల్స్‌ ఆటగాళ్లే. చాలాకాలం పాటు ఇద్దరూ కలసి ఆడినవాళ్లే. కొన్ని అంశాల్లో వ్యక్తిగతమైన విభేదాలు రావడంతో ఇద్దరూ తమ భాగస్వామ్యానికి గుడ్‌బై చెప్పారు. వేర్వేరు భాగస్వాములతో బరిలోకి దిగి ఇంటర్నేషనల్‌ టెన్నిస్‌లో బోలెడు ట్రోఫీలను సాధించారు. కలసే కాదు... వేరుపడినా ఎన్నో గ్రాండ్‌స్లామ్‌ ట్రోఫీలను దక్కించుకున్నారు.అయితే- వారిద్దరూ వేర్వేరు భాగస్వాములతో ఇంటర్నేషనల్‌ టోర్నీలలో ఆడితే ఎవ్వరికీ అభ్యంతరం లేదు. కానీ ఒలింపిక్స్‌ విషయానికొచ్చే సరికి ఇద్దరూ తప్పనిసరిగా దేశానికి ప్రాతినిథ్యం వహించాల్సిందే. ఎందుకంటే- ఒకే దేశం ఆటగాళ్లను మాత్రమే ఒలింపిక్స్‌లో ఆడేందుకు అనుమతిస్తారు. ప్రస్తుతం రేటింగ్‌ను బట్టి- లియాండర్‌ పేస్‌ భారత నంబర్‌వన్‌ డబుల్స్‌ ప్లేయర్‌, భూపతి రెండో స్థానంలో ఉన్నాడు. కాబట్టే- ఆలిండియా టెన్నిస్‌ సమాఖ్య పెద్దలు- సంకోచం లేకుండా ఇద్దరిని ఒక టీమ్‌గా ఎంపికచేశారు. అయితే ఇద్దరితో సంప్రదించి ఎంపిక చేస్తే బాగుండేది. కానీ ఏఐటీఏ మాత్రం వారితో చెప్పకుండానే టీమ్‌ను ప్రకటించింది. అక్కడే గొడవ ప్రారంభమైంది.ఏఐటీఏ ప్రకటనతో ఖిన్నుడైన భూపతి, తన అసహనాన్ని, ఆగ్రహాన్ని బాహాటంగానే వ్యక్తం చేశాడు. పేస్‌తో కలసి ఆడేది లేదని కుండబద్దలు కొట్టాడు. చివరకు రోహన్‌ బొప్పన్న కూడా పేస్‌తో ఆడబోనని చెప్పడం సమస్యను జటిలం చేసింది. భూపతి-బొప్పన్న ఇద్దరూ కలసి లండన్‌ వెళ్తామంటున్నారు. పేస్‌కు జోడీ కోసం ఏఐటీఏ ముందు పెద్దగా  ప్రత్యామ్నాయాలు మిగల్లేదు. సోమ్‌దేవ్‌ దేవ్‌వర్మన్‌ గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదు. అందుకే యూకీ బాంబ్రీ, విష్ణువర్ధన్‌లలో ఒకర్ని పేస్‌కు జోడీగా ఎంపికచేయాల్సి వచ్చింది. ఇది పేస్‌కు ఒకింత ఆవేదన కు లోనుచేసి ఉండవచ్చు. తన కొడుక్కి జూనియర్‌తో ఆడే ఖర్మ ఏమిటని పేస్‌ తండ్రి వీస్‌పేస్‌ కూడా నొచ్చుకున్నారు. ఆయన ఆవేదనలోనూ అర్థం లేకపోలేదు.


పేస్‌ను బుజ్జగించేందుకు ఏఐటీఏ- సానియా మీర్జాను ఉపయోగించుకుంటోంది. జూనియర్‌తో మెన్స్‌ డబుల్స్‌కు ఓకే చెబితే- మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సానియాతో జతకట్టే గోల్డెన్‌ చాన్స్‌ ఇస్తామని పేస్‌కు బంపర్‌ ఆఫర్‌ ఇచ్చింది. అయితే సానియా ఇంకా ఒలింపిక్‌ పోటీలకు అర్హత సాధించలేదు. ఆమె మహిళల డబుల్స్‌ ర్యాంక్‌ అర్హత ప్రమాణాలకు కాస్త దూరంగా ఉండటమే దీనికి కారణం. వుమెన్స్‌ డబుల్స్‌లో ఆడితేనే- సానియాకు మిక్స్‌డ్‌ డబుల్స్‌లో బరిలోకి దిగే ఛాన్స్‌ లభిస్తుంది. అందుకే సానియా ఒలింపిక్‌ నిర్వాహకులను వైల్డ్‌కార్డ్‌ అడుగుతోంది. అయితే సానియా-పేస్‌ జోడీ సమస్వయంతో ఆడి పతకం సాధించే అవకాశాలు అంతంతమాత్రమే. ఎందుకుంటే- సానియా కొనేళ్లుగా మిక్స్‌డ్‌ డబుల్స్‌లో మహేశ్‌ భూపతితో ఆడి మెరుగైన ఫలితాలే సాధిస్తోంది. సక్సెస్‌బాటలో పయనిస్తున్న జోడీని ఏఐటీఏ విడదీయడం కూడా మంచిది కాదు.


అసలే ఒలింపిక్స్‌లో పతకాలకు మొహం వాచిన భారత్‌కు ఈ తరహా పరిణామాలు విచారకరం. పతకం దక్కే అవకాశమున్న టెన్నిస్‌ డబుల్స్‌ ఈవెంట్లలో ఆటగాళ్ల ఎంపిక వ్యవహారం అనేక మలుపులు తిరగడం... తీరా అక్కడివెళ్లాక చతికిలబడటం మామూలైపోతుందేమో చూడాలి!

Monday, August 22, 2011

LONG LIVE ANNA

ఇపుడు జగమంతా ఒక్కటే మంత్రం. అదే అన్నా హజారే మంత్రం. అవును ఓ గాంధేయవాది నిస్వార్థంగా చేపట్టిన పోరాటం- యావత్‌ జాతిని కదిలించింది. కులమత భేదాలు లేకుండా, వయోపరిమితి భేదాలు లేకుండా అందర్నీ ఒక్క తాటిపైకి తెచ్చింది. ముఖ్యంగా యూపీఏ-2 సర్కార్‌ అధికారంలోకి వచ్చాక దేశంలో అవినీతి విచ్చలవిడిగా జరిగింది. రాజకీయ రాబందులు జాతి సంపదను దోచుకున్నారు. మనకళ్లముందే వేల కోట్ల రూపాయల గుటకాయ స్వాహా అయిపోయాయి. ఇవన్నీ చూస్తూ మనమనంతా ఊరుకున్నాం. మనకెందుకులే అని కళ్లుమూసుకున్నాం. కానీ న్యాయవ్యవస్థ, జాతీయ మీడియా అవినీతి కూపాన్ని బయటకు లాగాయి.
సంకీర్ణధర్మం అంటూ మన ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ వేదాలు వల్లిస్తుంటే- రాజా, కనిమొళి, కల్మాడీ తదితరులు కోట్లు మేశారు. కర్ణాటకలోనూ ఇదే జరిగింది. కానీ అక్కడి లోకాయుక్త చేసిన మేలు వల్ల కొంత న్యాయం జరిగింది. అవినీతి యడ్యూరప్ప తన సీఎం కుర్చీని వదిలిపెట్టక తప్పలేదు. బలమైన లోకాయుక్త, లోకపాల్‌ వ్యవస్థలు ఉంటే రాష్త్రాలు, దేశం అవినీతి కోరల నుంచి బయటపడతాయి.

లోకపాల్‌ చట్టం పరిధిలోకి ప్రధాని మంత్రేకాదు న్యాయవ్యవస్థ కూడా ఉండాలనేదే అన్నా హజారే డిమాండ్‌. అదే కేంద్రానికి, ఇతర జాతీయ పార్టీలకు నప్పడం లేదు. న్యాయవ్యవస్థకూ ఇటీవల కొందరు మచ్చతెచ్చారు. వారంతా లోకపాల్‌కు జవాబుదారులే. అసలు కొంతకాలంగా ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఏం చేస్తున్నారో అంతుబట్టడం లేదు. ఆయన కొందరి చేతిలో కీలుబొమ్మగా మారినట్టు స్పష్టమవుతోంది. కాకపోతే మరేమిటి, ఎంతో మేధావిగా పేరు తెచ్చుకున్న పీఎం- ఈరోజు తలదించుకోవాల్సిన దుస్థితి ఎందుకొచ్చింది? లోకపాల్‌ బిల్లు పరిధిలోకి ప్రధాని ఉండటంలో త ప్పులేదని ఆయన చెబుతున్నా, కాంగ్రెస్‌ పార్టీ పెద్దలు ఎందుకు జంకుతున్నారు? అంటే- ప్రధానికి ఏం చేసినా చెల్లుబాటు అవుతుందా?
నిజానికి గత వారం రోజులుగా భారతీయ మీడియాలో అన్నా వార్తలే. ఆయనకు మద్దతుగా దేశమంతా ర్యాలీలు. మొదట్లో లైట్‌ తీసుకున్న కేంద్రం ఇపుడు భయంతో వణికిపోతోంది. అన్నా తీసుకొచ్చిన విప్లవం చూసి పెద్దలు ఆందోళన చెందుతున్నారు. ఆయన్ను ఎలా లొంగదీసుకోవాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. తీహార్‌ జైలుకు పంపి నాలుక కర్చుకున్న కేంద్రం ఇపుడు అన్నా ముందు దోషిగా నిలబడింది. నిజంగానే దేశంలో ఇపుడు రెండో స్వాతంత్య్ర పోరాటం చేస్తోంది. అవినీతిని తరిమికొట్టే సమయం ఆసన్నమైంది.
ఇంక్విలాబ్‌ జిందాబాద్‌, అన్నా జిందాబాద్‌.  జైబోలో భారత్‌మాతాకీ జై!Monday, May 16, 2011

GREAT INSPIRATIONనేల తల్లి తన ఇద్దరు ముద్దు బిడ్డలను తనలో విలీనం చేసుకుంది. ఒకరు మానవ హక్కుల కోసం గళం ఎత్తితే, మరొకరు రైతన్న కోసం నినదించారు. ఆ ఇద్దరు మహానుభావులను 24 గంటల తేడాలో మనల్ని శాశ్వతంగా
వదిలి వె ళ్లడం నన్ను తీవ్రంగా కలచి వేసింది.

మన తెలుగుబిడ్డ కాకతీయ యూనివర్సిటీ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ బుర్రా రాములు- ఎక్కడ హక్కులు భంగపడితే అక్కడ వాలేవారు. బడుగు వారి పక్షాన పోరాడేవారు. ట్రేడ్‌ యూనియన్లలోనూ, పౌరహక్కుల సంఘంలోనూ, తర్వాత మానవహక్కుల వేదికలోనూ ఆయన చేసిన సేవలు ఈ తరం వారికి ఆదర్శప్రాయం.
ఇక మహేంద్రసింగ్‌ తికాయత్‌ గురించి మన తెలుగువారికి చాలా తక్కువ తెలుసు. ఆయన అవిశ్రాంత రైతు పోరాట యోధుడు. ఉత్తర భారతంలో రైతాంగానికి ఆయన పెద్ద దిక్కుగా నిలిచారు. భారతీయ కిసాన్‌ యూనియన్‌ పక్షాన తికాయత్‌ చేసిన పోరాటం కారణంగా అన్నదాతకు ఎంతో మేలు జరిగింది. ఉత్తరప్రదేశ్‌ లోని ముజఫర్‌నగర్‌ జిల్లాకు చెందిన ఆయన చెరుకుకు మద్దతు ధర కల్పించాలని, భారమైన రుణాల మాఫీ కోసం, విద్యుత్‌ ఛార్జీల తగ్గింపు కోసం మహాధర్నాలు నిర్వహించి, కేంద్రాన్ని ఉక్కిరిబిక్కిరి చేశారు.

ఈ ఇద్దరు జన నేతలకు నా శ్రద్ధాంజలి...

Saturday, April 23, 2011

HEY BHAGAVANభగవాన్‌... సత్య సాయిబాబా...ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవం. ఆయన చేపట్టిన సేవా కార్యక్రమాలు, చేసిన ఆధ్యాత్మిక భోదనలు అనన్య సామాన్యమైనవి. ఆయన నిర్యాణం చెందారన్న వార్త భక్తులనే కాదు యావత్‌ మానవాళిని కదిలించేసింది. ఎందుకంటే- ఆయన చేసిన సేవా కార్యక్రమాలు అటువంటివి. ఉన్నత విద్య, సూపర్‌ స్పెషాలిటీ వైద్యం, మంచినీటి సదుపాయం అందుబాటులోకి తీసుకురావడం ఆయనకే సాధ్యమైంది. ప్రపంచ వ్యాప్తంగా ఎందరో గురువులు, మహిమాన్విత వ్యక్తులు ఉన్నారు. కానీ ఎవ్వరూ చేయని విధంగా,  ఈ సాయి చేయడం విశేషం. అందుకే నాకు విశ్వాసం లేకున్నా... ఆయన సేవాభావాన్ని ప్రేమించాను.


ఆయన మహిమల గురించి వినిపించే విమర్శలను నేను పట్టించుకోను... ఎందుకంటే- ఆయన సేవా కార్యక్రమాల ముందు- ఈ విమర్శలు నిలబడవు కాబట్టి. చివరకు బీబీసీ మీడియా కూడా బాబాను అప్రతిష్టపాలు చేయాలని ప్రయత్నించింది. నిత్యం తనను దర్శించుకునే భక్తులకు బాబా ప్రముఖంగా అయిదు సూత్రాలు భోదించారు. అవి- ప్రేమ, శాంతి, ధర్మం, సత్యం, అహింస... నిజంగా ఈ పదాలు వింటేనే నా మనసు పులకించిపోతుంది. వీటినే ఆధారంగా చేసుకుంటే మానవుని జీవితం ధన్యమవుతుందని బాబా చెప్పారు.


ఆయన భోదనల్లో నాకు నచ్చిన ప్రవచనం... నేను దేవుడిని, నీవు కూడా దేవుడివే, తేడా ఏమిటంటే, ఈ సంగతి నాకు తెలుసు, నీకు అసలు తెలియదు.