Saturday, June 23, 2012

Tennis

Paes-Bhupathi Controversy


టెన్నిస్‌ పెద్దల నిర్వాకం... భారతదేశానికి  ఒలింపిక్‌ మెడల్‌ను దూరం చేస్తోంది. ఇద్దరు అగ్రశ్రేణి క్రీడాకారుల తగాదా... మనస్పర్థలు.. భారత క్రీడారంగంలో పెద్ద దుమారాన్నే లేపాయి. ఒకవైపు చూస్తే... లియాండర్‌ పేస్‌... రెండోవైపున మహేశ్‌ భూపతి.! ఇద్దరూ నిస్పందేహంగా టాప్‌ డబుల్స్‌ ఆటగాళ్లే. చాలాకాలం పాటు ఇద్దరూ కలసి ఆడినవాళ్లే. కొన్ని అంశాల్లో వ్యక్తిగతమైన విభేదాలు రావడంతో ఇద్దరూ తమ భాగస్వామ్యానికి గుడ్‌బై చెప్పారు. వేర్వేరు భాగస్వాములతో బరిలోకి దిగి ఇంటర్నేషనల్‌ టెన్నిస్‌లో బోలెడు ట్రోఫీలను సాధించారు. కలసే కాదు... వేరుపడినా ఎన్నో గ్రాండ్‌స్లామ్‌ ట్రోఫీలను దక్కించుకున్నారు.



అయితే- వారిద్దరూ వేర్వేరు భాగస్వాములతో ఇంటర్నేషనల్‌ టోర్నీలలో ఆడితే ఎవ్వరికీ అభ్యంతరం లేదు. కానీ ఒలింపిక్స్‌ విషయానికొచ్చే సరికి ఇద్దరూ తప్పనిసరిగా దేశానికి ప్రాతినిథ్యం వహించాల్సిందే. ఎందుకంటే- ఒకే దేశం ఆటగాళ్లను మాత్రమే ఒలింపిక్స్‌లో ఆడేందుకు అనుమతిస్తారు. ప్రస్తుతం రేటింగ్‌ను బట్టి- లియాండర్‌ పేస్‌ భారత నంబర్‌వన్‌ డబుల్స్‌ ప్లేయర్‌, భూపతి రెండో స్థానంలో ఉన్నాడు. కాబట్టే- ఆలిండియా టెన్నిస్‌ సమాఖ్య పెద్దలు- సంకోచం లేకుండా ఇద్దరిని ఒక టీమ్‌గా ఎంపికచేశారు. అయితే ఇద్దరితో సంప్రదించి ఎంపిక చేస్తే బాగుండేది. కానీ ఏఐటీఏ మాత్రం వారితో చెప్పకుండానే టీమ్‌ను ప్రకటించింది. అక్కడే గొడవ ప్రారంభమైంది.



ఏఐటీఏ ప్రకటనతో ఖిన్నుడైన భూపతి, తన అసహనాన్ని, ఆగ్రహాన్ని బాహాటంగానే వ్యక్తం చేశాడు. పేస్‌తో కలసి ఆడేది లేదని కుండబద్దలు కొట్టాడు. చివరకు రోహన్‌ బొప్పన్న కూడా పేస్‌తో ఆడబోనని చెప్పడం సమస్యను జటిలం చేసింది. భూపతి-బొప్పన్న ఇద్దరూ కలసి లండన్‌ వెళ్తామంటున్నారు. పేస్‌కు జోడీ కోసం ఏఐటీఏ ముందు పెద్దగా  ప్రత్యామ్నాయాలు మిగల్లేదు. సోమ్‌దేవ్‌ దేవ్‌వర్మన్‌ గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదు. అందుకే యూకీ బాంబ్రీ, విష్ణువర్ధన్‌లలో ఒకర్ని పేస్‌కు జోడీగా ఎంపికచేయాల్సి వచ్చింది. ఇది పేస్‌కు ఒకింత ఆవేదన కు లోనుచేసి ఉండవచ్చు. తన కొడుక్కి జూనియర్‌తో ఆడే ఖర్మ ఏమిటని పేస్‌ తండ్రి వీస్‌పేస్‌ కూడా నొచ్చుకున్నారు. ఆయన ఆవేదనలోనూ అర్థం లేకపోలేదు.


పేస్‌ను బుజ్జగించేందుకు ఏఐటీఏ- సానియా మీర్జాను ఉపయోగించుకుంటోంది. జూనియర్‌తో మెన్స్‌ డబుల్స్‌కు ఓకే చెబితే- మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సానియాతో జతకట్టే గోల్డెన్‌ చాన్స్‌ ఇస్తామని పేస్‌కు బంపర్‌ ఆఫర్‌ ఇచ్చింది. అయితే సానియా ఇంకా ఒలింపిక్‌ పోటీలకు అర్హత సాధించలేదు. ఆమె మహిళల డబుల్స్‌ ర్యాంక్‌ అర్హత ప్రమాణాలకు కాస్త దూరంగా ఉండటమే దీనికి కారణం. వుమెన్స్‌ డబుల్స్‌లో ఆడితేనే- సానియాకు మిక్స్‌డ్‌ డబుల్స్‌లో బరిలోకి దిగే ఛాన్స్‌ లభిస్తుంది. అందుకే సానియా ఒలింపిక్‌ నిర్వాహకులను వైల్డ్‌కార్డ్‌ అడుగుతోంది. అయితే సానియా-పేస్‌ జోడీ సమస్వయంతో ఆడి పతకం సాధించే అవకాశాలు అంతంతమాత్రమే. ఎందుకుంటే- సానియా కొనేళ్లుగా మిక్స్‌డ్‌ డబుల్స్‌లో మహేశ్‌ భూపతితో ఆడి మెరుగైన ఫలితాలే సాధిస్తోంది. సక్సెస్‌బాటలో పయనిస్తున్న జోడీని ఏఐటీఏ విడదీయడం కూడా మంచిది కాదు.


అసలే ఒలింపిక్స్‌లో పతకాలకు మొహం వాచిన భారత్‌కు ఈ తరహా పరిణామాలు విచారకరం. పతకం దక్కే అవకాశమున్న టెన్నిస్‌ డబుల్స్‌ ఈవెంట్లలో ఆటగాళ్ల ఎంపిక వ్యవహారం అనేక మలుపులు తిరగడం... తీరా అక్కడివెళ్లాక చతికిలబడటం మామూలైపోతుందేమో చూడాలి!

0 comments:

Post a Comment