Monday, February 28, 2011

My Telangana


జై తెలంగాణ... ఈ పదాన్ని ఉచ్చరించడానికి ఒక ప్పుడు వెనుకంజ వేసిన వాళ్లంతా ఇపుడు నినదిస్తున్నరు. ఇపుడు తెలంగాణ పల్లెపల్లెల్లో వినిపిస్తున్నది ఈ నినాదమే. పార్టీలు అక్కర్లేదు, నాయకులు అక్కర్లేదు, జెండాలు అక్కర్లేదు, అజెండాలు అక్కర్లేదు. ఇపుడు అంతా ఒకే గొంతుకై తెలంగాణ స్వాతంత్య్రానికి పోరాడుతున్నరు.

ఇన్నాళ్లుగా రాజకీయ పార్టీలు, రాజకీయ నేతలు, ప్రజలను తమ స్వార్థ ప్రయోజనాలకు వాడుకున్నరు. ఇక వారి కుటిలనీతి సాగదు. వారి దుష్టపన్నాగాలు సాగవు. ఇపుడు జై తెలంగాణ నినాదం ప్రజలది. నాలుగు కోట్ల తెలంగాణ బిడ్డలది. మన కోస్తాంధ్ర సోదరులు, ఉత్తరాంధ్ర సోదరులు, రాయలసీమ సోదరులు ఇది అర్థం చేసుకుంటున్నరు. కానీ అక్కడి నేతలు కొందరు దీన్ని భూతద్దంలో చూపించి- ఎప్పటిలాగే- తెలంగాణ ప్రజలను, తెలంగాణ ప్రాంతాన్ని దోచుకోవాలని కుట్రపన్నుతున్నరు.

ఇది 1969 కాదు, ప్రజలు మళ్లీ మోసపోవడానికి. చెన్నారెడ్డిని ఆనాడు అత్యధిక లోకసభ స్థానాలు గెల్చుకున్న తెలంగాణ ప్రజాసమితిని కేంద్రం పెద్దలు మాయమాటలు చెప్పి, మోసం చేసి ఉండవచ్చు. ఈనాడు కూడా కేసీఆర్‌ను, తెలంగాణ రాష్ట్రసమితిని మరోసారి మోసం చేసే ఆలోచనలో సీమాంధ్ర నేతలు, అటు ఢిల్లీ పెద్దలు కుట్ర చేస్తూ ఉండవచ్చు. కానీ నాలుగు కోట్ల తెలంగాణ గొంతుకలను ఆపలేరు. డబ్బులతో, లాలూచీతో ఏదో చేయాలనుకుంటే- మొదటికే మోసం వస్తుంది. ఉద్యమం అంతకంతకూ తీవ్ర రూపం దాలుస్తుంది. ఆ స్థితిని తీసుకురావద్దని నా మనవి.

మొన్న 48 గంటల దిగ్భందనానికే చాలామందికి విసుగుపుట్టింది. తెలంగాణపై కేంద్ర నాన్చుడు వైఖరిని అటు సమైక్యాంధ్రులే కాదు తటస్థులు కూడా తప్పుబట్టారు. ఇపుడు రైల్‌రోకో, ఈనెల ౧౦న మిలియన్‌ మార్చ్‌లు ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లతాయి. సోనియా, మన్మోహన్‌లే కాదు ఆంధ్ర, రాయలసీమ ప్రజాప్రతినిధులు ఇలాంటి వైఖరినే కొనసాగిస్తే- మున్ముందు ఉద్యమం మరింత తీవ్రరూపం దాలుస్తుంది. కొందరు స్వార్థరాజకీయ నాయకుల కోసం తెలుగు సోదరులు పోట్లాడుకోవాలా? తప్పు తప్పు. తెలంగాణ ఉద్యమ ప్రభంజనంలో కుటిల రాజకీయ నేతలు కొట్టుకుపోయే రోజు ఎంతో దూరంలో లేదు.

0 comments:

Post a Comment