Saturday, March 19, 2011

POLITICS & MONEY





ఏ ముహుర్తంలో ఈ దేశానికి ఫ్రీడం వచ్చిందో గాని, అంతా అవినీతిమయం అయిపోయింది. అన్ని వ్యవస్థలు భ్రష్టుపట్టిపోతున్నాయి. ఒకప్పుడు పనిచేస్తేనే లంచం తీసుకునేవాళ్లు. ఇపుడు పనిచేయకపోయినా... డబ్బులు దండుకుంటున్నారు. స్కీముల పేరు చెప్పి- దొరికినకాడికి దోచుకుంటున్నారు. అడిగే నాథుడే లేడు. ఎందుకంటే- అందరి నోళ్లు డబ్బు మూయిస్తోంది కాబట్టి.


వికీ లీక్స్‌ తీగల దుమారం రెండురోజులుగా పార్లమెంట్‌ను కుదిపేస్తోంది. ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నాయి. ఈ అవకాశాన్ని తమకు అనుకూలం చేసుకోవాలని పాపం కమలనాథులు విఫలయత్నం చేస్తున్నారు. వారు అధికారంలో ఉండగా ఏం జరిగిందో అందరికీ తెలుసు. ఏ పార్టీని, ఏ నాయకున్ని నమ్మే రోజులు కావు ఇవి.


తమిళనాడులో ఎన్నికలకు ముందే అవినీతి కంపు కొడుతోంది. కోట్లాది రూపాయలు పంచిపెడుతున్నారు. నానారకాల స్కీములు ప్రవేశపెట్టి- ఓటర్లను మభ్యపెడుతున్నారు. ఇది ఒకందుకు మంచిదే. ఇన్నాళ్లపాటు పేదల కడుపుకొట్టి దోచుకున్న ధనం మళ్లీ పేదల చెంతకే వెళ్లడం ఒక మంచి పరిణామమే. కానీ ఇలా గెలిచిన వాళ్లు మళ్లీ జనంపై విరుచుకుపడతారు. ఖజానా లూటీ చేస్తారు. అపుడు నిలదీసే హక్కు ప్రజలకు ఉండదు.


తాజాగా, మన రాష్ట్రంలో జరిగిన MLC ఎన్నికలు- అన్ని పార్టీలలో కలకలం రేపాయి. ముఖ్యంగా KCRకు ఈ ఎన్నికలు మంచి గుణపాఠమే నేర్పాయి. ఏదో తల్చుకుంటే- ఏదో జరిగింది. ముగ్గురు ఎమ్మెల్యేలు క్రాస్‌ఓటింగ్‌ చేశారన్న వార్త కొందర్ని నిశ్చేష్టపరిచింది. అధినేతకు తెలిసే జరిగిందని కొందరు, లేదని కొందరు వాదిస్తున్నారు. మొత్తం మీద ముగ్గురిపై సస్పెన్షన్‌ వేటుతో కేసీఆర్‌ తనపై అనుమానాలను కొంతమేరకు తగ్గించగలిగారు.

0 comments:

Post a Comment