Saturday, March 19, 2011

POLITICS & MONEY

ఏ ముహుర్తంలో ఈ దేశానికి ఫ్రీడం వచ్చిందో గాని, అంతా అవినీతిమయం అయిపోయింది. అన్ని వ్యవస్థలు భ్రష్టుపట్టిపోతున్నాయి. ఒకప్పుడు పనిచేస్తేనే లంచం తీసుకునేవాళ్లు. ఇపుడు పనిచేయకపోయినా... డబ్బులు దండుకుంటున్నారు. స్కీముల పేరు చెప్పి- దొరికినకాడికి దోచుకుంటున్నారు. అడిగే నాథుడే లేడు. ఎందుకంటే- అందరి నోళ్లు డబ్బు మూయిస్తోంది కాబట్టి.


వికీ లీక్స్‌ తీగల దుమారం రెండురోజులుగా పార్లమెంట్‌ను కుదిపేస్తోంది. ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నాయి. ఈ అవకాశాన్ని తమకు అనుకూలం చేసుకోవాలని పాపం కమలనాథులు విఫలయత్నం చేస్తున్నారు. వారు అధికారంలో ఉండగా ఏం జరిగిందో అందరికీ తెలుసు. ఏ పార్టీని, ఏ నాయకున్ని నమ్మే రోజులు కావు ఇవి.


తమిళనాడులో ఎన్నికలకు ముందే అవినీతి కంపు కొడుతోంది. కోట్లాది రూపాయలు పంచిపెడుతున్నారు. నానారకాల స్కీములు ప్రవేశపెట్టి- ఓటర్లను మభ్యపెడుతున్నారు. ఇది ఒకందుకు మంచిదే. ఇన్నాళ్లపాటు పేదల కడుపుకొట్టి దోచుకున్న ధనం మళ్లీ పేదల చెంతకే వెళ్లడం ఒక మంచి పరిణామమే. కానీ ఇలా గెలిచిన వాళ్లు మళ్లీ జనంపై విరుచుకుపడతారు. ఖజానా లూటీ చేస్తారు. అపుడు నిలదీసే హక్కు ప్రజలకు ఉండదు.


తాజాగా, మన రాష్ట్రంలో జరిగిన MLC ఎన్నికలు- అన్ని పార్టీలలో కలకలం రేపాయి. ముఖ్యంగా KCRకు ఈ ఎన్నికలు మంచి గుణపాఠమే నేర్పాయి. ఏదో తల్చుకుంటే- ఏదో జరిగింది. ముగ్గురు ఎమ్మెల్యేలు క్రాస్‌ఓటింగ్‌ చేశారన్న వార్త కొందర్ని నిశ్చేష్టపరిచింది. అధినేతకు తెలిసే జరిగిందని కొందరు, లేదని కొందరు వాదిస్తున్నారు. మొత్తం మీద ముగ్గురిపై సస్పెన్షన్‌ వేటుతో కేసీఆర్‌ తనపై అనుమానాలను కొంతమేరకు తగ్గించగలిగారు.

Saturday, March 5, 2011

EXAM TIMEఇది పరీక్షల సమయం. నిజంగానే కేవలం విద్యార్థులకే కాదు- రాజకీయ నేతలకు, రాజకీయ పక్షాలకు. ఇంకా చెప్పాలంటే, కేంద్ర -రాష్త్ర ప్రభుత్వాలకు కూడా. ఎందుకంటే- పిల్లలైతే చదువుకుంటారు. పరీక్షలు రాస్తారు. కానీ రాజకీయ నాయకులకు చదువులతో పనిలేదు. వారికి తెలిసిందల్లా రాజకీయాలు చేయడమే. అవకాశం దొరికితే- విద్యార్థుల్ని సైతం పావుగా వాడుకోవడమే. వారి భావోద్వేగాలకు వందల మంది విద్యార్థులు బలపీటమెక్కారు. కానీ రాజకీయ నేతలు మాత్రం కుటిలయత్నాలు మానడం లేదు. విశ్వాసం నెలకొల్పే చర్యలు చేపట్టడం లేదు. ప్రభుత్వం కూడా అలాగే ఉంది.

ఇపుడు రాష్ట్ర ప్రజలను పదో తేదీ వణికిస్తోంది. ముఖ్యంగా రాజధానిలో నివసించే వారికి ఇది ఎక్కువగా ఉంది. ఆరోజు ఏం జరుగుతుందోనని అంతా ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా దశాబ్దాలకిందట వలసవచ్చిన ఆంధ్ర సోదరులను ఈ పరిణామాలు భయాందోళన కలిగిస్తున్నాయి. వారికేం జరగదని, వారిజోలికి వెళ్లమని రాజకీయ ఐకాస స్పష్టంగా ప్రకటించాలి. అపుడే మిలియన్‌ మార్చ్‌ అర్థమంతమవుతుంది.

ఇక విద్యార్థుల విషయానికొస్తే- అంతా అయోమయం, గందరగోళం. ప్రభుత్వం పట్టుదలకు పోతే- పరిస్థితి ఏంటి? పదో తేదీ సీనియర్‌ ఇంటర్‌ ఇంగ్లీష్‌ పరీక్ష ఉంది. అది రాయడానికి లక్షలాది మంది స్టూడెంట్స్‌ ఎదురుచూస్తున్నారు. పోలీస్‌ పహారాలో పరీక్షలు రాసే పరిస్థితి రాకూడదు. రెండు పక్షాలు పట్టువిడుపులకు సిద్ధంగా ఉండాలి. పిల్లలకు ఇంటర్‌ పరీక్షలు ఎంతో కీలకం. వారి లైఫ్‌లో ఈ పరీక్షలు టర్నింగ్‌పాయింట్‌. వారిని ధైర్యంగా పరీక్షలు రాయనిద్దాం.

భవిష్యత్‌ తెలంగాణ వారికోసమే అన్నప్పడు, భవిష్యత్‌ విద్యార్థులకు ఏం నష్టం వాటిల్లకుండా జాగ్రత్తపడదాం. ప్రభుత్వం కూడా పంతానికి పోకుండా పదో తేదీన పరీక్షను వాయిదా వేస్తే- పిల్లలు, వారి తల్లిదండ్రులు కాస్త ఊపిరిపీల్చుకుంటారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని కేంద్ర సర్కార్‌, కాంగ్రెస్‌ హైకమాండ్‌లు సూచనప్రాయంగా చెబుతున్నాయ్‌ కాబట్టి- హైదరాబాద్‌లో జరగబోయే పరీక్షల నిర్వహణకు అన్ని రాజకీయ పక్షాలు అనుకూల వాతావరణాన్ని కల్పించాలి.