Monday, February 28, 2011

My Telangana


జై తెలంగాణ... ఈ పదాన్ని ఉచ్చరించడానికి ఒక ప్పుడు వెనుకంజ వేసిన వాళ్లంతా ఇపుడు నినదిస్తున్నరు. ఇపుడు తెలంగాణ పల్లెపల్లెల్లో వినిపిస్తున్నది ఈ నినాదమే. పార్టీలు అక్కర్లేదు, నాయకులు అక్కర్లేదు, జెండాలు అక్కర్లేదు, అజెండాలు అక్కర్లేదు. ఇపుడు అంతా ఒకే గొంతుకై తెలంగాణ స్వాతంత్య్రానికి పోరాడుతున్నరు.

ఇన్నాళ్లుగా రాజకీయ పార్టీలు, రాజకీయ నేతలు, ప్రజలను తమ స్వార్థ ప్రయోజనాలకు వాడుకున్నరు. ఇక వారి కుటిలనీతి సాగదు. వారి దుష్టపన్నాగాలు సాగవు. ఇపుడు జై తెలంగాణ నినాదం ప్రజలది. నాలుగు కోట్ల తెలంగాణ బిడ్డలది. మన కోస్తాంధ్ర సోదరులు, ఉత్తరాంధ్ర సోదరులు, రాయలసీమ సోదరులు ఇది అర్థం చేసుకుంటున్నరు. కానీ అక్కడి నేతలు కొందరు దీన్ని భూతద్దంలో చూపించి- ఎప్పటిలాగే- తెలంగాణ ప్రజలను, తెలంగాణ ప్రాంతాన్ని దోచుకోవాలని కుట్రపన్నుతున్నరు.

ఇది 1969 కాదు, ప్రజలు మళ్లీ మోసపోవడానికి. చెన్నారెడ్డిని ఆనాడు అత్యధిక లోకసభ స్థానాలు గెల్చుకున్న తెలంగాణ ప్రజాసమితిని కేంద్రం పెద్దలు మాయమాటలు చెప్పి, మోసం చేసి ఉండవచ్చు. ఈనాడు కూడా కేసీఆర్‌ను, తెలంగాణ రాష్ట్రసమితిని మరోసారి మోసం చేసే ఆలోచనలో సీమాంధ్ర నేతలు, అటు ఢిల్లీ పెద్దలు కుట్ర చేస్తూ ఉండవచ్చు. కానీ నాలుగు కోట్ల తెలంగాణ గొంతుకలను ఆపలేరు. డబ్బులతో, లాలూచీతో ఏదో చేయాలనుకుంటే- మొదటికే మోసం వస్తుంది. ఉద్యమం అంతకంతకూ తీవ్ర రూపం దాలుస్తుంది. ఆ స్థితిని తీసుకురావద్దని నా మనవి.

మొన్న 48 గంటల దిగ్భందనానికే చాలామందికి విసుగుపుట్టింది. తెలంగాణపై కేంద్ర నాన్చుడు వైఖరిని అటు సమైక్యాంధ్రులే కాదు తటస్థులు కూడా తప్పుబట్టారు. ఇపుడు రైల్‌రోకో, ఈనెల ౧౦న మిలియన్‌ మార్చ్‌లు ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లతాయి. సోనియా, మన్మోహన్‌లే కాదు ఆంధ్ర, రాయలసీమ ప్రజాప్రతినిధులు ఇలాంటి వైఖరినే కొనసాగిస్తే- మున్ముందు ఉద్యమం మరింత తీవ్రరూపం దాలుస్తుంది. కొందరు స్వార్థరాజకీయ నాయకుల కోసం తెలుగు సోదరులు పోట్లాడుకోవాలా? తప్పు తప్పు. తెలంగాణ ఉద్యమ ప్రభంజనంలో కుటిల రాజకీయ నేతలు కొట్టుకుపోయే రోజు ఎంతో దూరంలో లేదు.

Saturday, February 26, 2011

CHILDREN POETS


నిజంగానే- వారిద్దరు మహనీయులు. ఇద్దరూ వారి రచనలతో ప్రజలను రంజింపజేశారు. ఒకరు అనంత్‌ పాయ్‌, రెండోవారు ముళ్లపూడి. కొద్దిగంటల తేడాలో ఇద్దరూ మరణించడం చాలా ఆవేదనకు గురిచేసంది.


అంకుల్‌ పాయ్‌గా చిరపరిచితుడైన అనంత్‌- తన కామిక్స్‌తో ఓ విప్లవానికి నాంది పలికారు. ఆయన రచించిన అమర్‌చిత్రకథలు- అన్ని భాషల్లోకి అనువదించారు. తద్వారా పిల్లలకు మన ప్రాచీన, పౌరాణిక, ఆధ్యాత్మిక, చరిత్రాత్మక విశేషాలన్నీ తెలిశాయి. చక్కటి బొమ్మలతో, అర్థమయ్యే పదజాలంతో ఆయన రచనలు గొప్ప ఖ్యాతినార్జించాయి. దూరదర్శన్‌  ఏర్పాటు చేసిన ఓ క్విజ్‌ కార్యక్రమంలో పిల్లలకు భారత పురాణాల పట్ల ఎలాంటి అవగాహన లేదని తెలుసుకున్న ఆయన అమర్‌ చిత్ర కథలకు పూనుకోవడం చిన్నారులు చేసుకున్న భాగ్యం అనుకోవాలి. అలాగే టింకిల్‌ పేరిట పిల్లల కోసమే మరో కామిక్స్‌ సిరీస్‌ను ఆరంభించారు. ఈ రెండు దేశంలో ఎంతో ప్రసిద్ధిగాంచాయి.



ఇక మన ముళ్లపూడి గురించి నేను ఏం చెప్పగలను. బాపు-రమణలది విడదీయరాని జంటగా ఉండేది. ఒకరు శరీరమైతే- మరొకరు ఆత్మగా ఉండేవారు. ఆయన సాహిత్యంలో అన్నీ ఉండేవి. సినిమా కథలు, నవలలు, హాస్యరచనలు, సంభాషణలు... ఇలా అన్ని వర్గాల వారికి కావల్సినంత విందును, వినోదాన్ని పంచిపెట్టారాయన. సినిమాలలో ఆయన రచనా శైలిని మెచ్చుకోని వారు లేరు. ముత్యాలముగ్గులోని డైలాగ్స్‌- ఇప్పటికీ గుర్తున్నాయి. బుడుగు హాస్యరచనలు ముళ్లపూడికి ఎంతో పేరు తెచ్చిపెట్టాయి. చిన్నారులను అలరించాయి. అంకుల్‌ పాయ్‌లాగే రమణ కూడా పిల్లల కోసం ఎంతో శ్రద్ధతో రచనలు చేసేవారు. పిల్లల కోసం ఆలోచించిన ఇద్దరు మహనీయులు మనమధ్య నుంచి వెళ్లిపోవడం బాల్యప్రపంచానికి తీరని లోటు.

Thursday, February 17, 2011

IAS POLITICIAN


ఏదైతే జరగవద్దని... ఇన్నాళ్లుగా అనుకున్నానో... అదే జరిగింది. తెలంగాణ వాదిగా- ఉద్యమం శాంతియుతంగా జరగాలిని, సీమాంధ్ర సోదరుల అంగీకారం, సహకారంతోనే విడిపోవాలని కోరుకున్న వాళ్లలో నేనూ ఒక న్ని. కానీ... అసెంబ్లీ సాక్షిగా- కాంగ్రెస్‌ కుటిల రాజకీయాల సాక్షిగా దురద్రుష్టకరమైన సంఘటన జరిగే పోయింది. తెలంగాణ వాదాన్ని ఎప్పుడూ కించపరిచే మాజీ ఐ.ఎ.ఎస్‌. అధికారి- తాజా రాజకీయాలు అంటే పూర్తిగా అవగాహన లేని జేపీపై దాడి జరిగింది. ఓ ప్రజాస్వామ్యవాదిగా, ఓ శాంతికాముకుడిగా నేను ఆ దాడిని ఖండిస్తాను. కానీ జేపీ చేసిందేమిటి? అప్పటికే- అసెంబ్లీ లోపల మార్షల్స్‌చే గెంటివేయబడిన టి.ఆర్‌.ఎస్‌. ఎమ్మెల్యేలు ఎదురుగా ఉన్నప్పటికీ- లెక్కచేయకుండా, మీడియా ముందు అనవసర విషయాలను ప్రస్తావించడంతో- TRS శాసనసభ్యులు తమను తాము నియంత్రించుకోలేకపోయారు. దాని ఫలితమే ఆ దాడి.

అయితే- శాసనసభలో ఎన్నో పార్టీలున్నాయి. ఎందరో సీనియర్‌ శాసనసభ్యులున్నారు. తెలంగాణ వ్యతిరేక పార్టీలున్నాయి. కానీ ఎవ్వరికీ లేని అభ్యంతరాలు కేవలం జేపీకే ఉండటం కూడా అర్థంకానిది. అంతా వ్యూహాత్మకంగా పోతుంటే- లోకసత్తా నేత జయప్రకాశ్‌నారాయణ్‌ మాత్రం మీడియా పాయింట్‌ వద్ద ఇష్టానుసారంగా మాట్లాడి టి.ఆర్‌.ఎస్‌. ఎమ్మెల్యేలను రెచ్చగొట్టారు. దాని ఫలితమే ఈ దాడి.

జేపీ లాంటి నేతలు- కాంగ్రెస్‌ సభ్యులను చూసి చాలా నేర్చుకోవాలి. గవర్నర్‌ ప్రసంగం, టి.ఆర్‌.ఎస్‌, టీడీపీ వ్యూహాలకు జడిసి- ఢిల్లీలోనే దాచుకున్న కాంగ్రెస్‌ శాసనసభ్యులను చూసి జేపీ చాలా నేర్చుకోవాలి. ఎక్కడ తెలంగాణ వాదానికి మద్దతు ప్రకటించాల్సి వస్తుందన్న భయంతో కాంగ్రెస్‌ తెలంగాణ నేతలు- ఏపీ భవన్‌లోనే మకాం వేస్తే- ఇక్కడ జేపీ లాంటి వారు కాంగ్రెస్‌ చేతిలో పావుగా మారారు.

SORRY PM



ఇటీవల కాలంలో ఎలక్ట్రానిక్‌ మీడియాలో వస్తున్న కుంభకోణాల శరపరంపరను తిప్పికొట్టడానికి అన్నట్టుగా దేశ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ప్రముఖ టెలివిజన్‌ ఛానెళ్ల ఎడిటర్లతో ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కానీ ఆర్థికరంగంలో తలపండిపోయిన మన్మోహన్‌ జీ- ఇంకా రాజకీయంలో ఎదగలేదని ఆయన వైఖరి స్పష్టమైంది. నిజమే- ఒక ఆర్థిక వేత్త, నిజాయితీపరుడికి రాజకీయం చేతకాదు. సొంతపక్షం చేతిలో కీలుబొమ్మగా మారిన మన్మోహన్‌- అటు సంకీర్ణంలోని భాగస్వామ్యపక్షాలనూ అదుపు చేయడంలో విఫలమవుతున్నారు. అదే- ఇపుడు దేశం పాలిట, ప్రజల పాలిట శాపమైంది.

ఎడిటర్లు సంధించిన ప్రశ్నలకు ప్రధాని జవాబు చెప్పలేక నీళ్లు నమలాల్సి వచ్చింది. టీవీలో మీడియా కాన్ఫరెన్స్‌ను చూసినవారికి ఇది గుర్తే ఉంటుంది CNN-IBN బాస్‌ రాజ్‌దీప్‌ సర్‌దేశాయ్‌ అడిగిన ప్రశ్నకు మన్మోహన్‌ నీళ్లు తాగాల్సి వచ్చింది. తన వల్ల తప్పులు జరుగుతున్నాయని అంగీకరించిన ప్రధాని- మొత్తం అవినీతికి తానే దోషిని అంటే కరెక్ట్‌ కాదన్నారు. మీడియా అత్యుత్సాహం వల్ల- మొత్తం భారతావని అవినీతి కూపంగా మారిందన్న అభిప్రాయం కల్పించే యత్నం కలుగుతోందని వాపోయారు. యూపీఎ-2 హయాంలో వెలుగులోకి వచ్చిన కుంభకోణాలను ప్రస్తావిస్తూ- అంతా పారదర్శకంగానే జరిగినట్టు తనవారిని వెనకేసుకొచ్చారు.

అసలు ప్రధాని ఏం చెప్పదల్చుకున్నారు? సంకీర్ణ సర్కారు ఉంటే- అవినీతి జరుగుతుందా? కళ్ల ముందే వేల కోట్లు ఎగరేసుకుపోతున్నా మన నిఘా సంస్థలు కళ్లు మూసుకోవాలా? ప్రభుత్వానికి ఇబ్బంది రావద్దు కాని- ప్రజల సొమ్ము లూటీ కావ ల్సిందేనా? ఇదేం న్యాయం? ఎవడబ్బసొమ్మని ఈ రాజకీయ రాబందులు- లాబీయిస్టులు, పారిశ్రామికవేత్తల  వైట్‌ కాలర్‌ నేరాలు జరగాల్సిందేనా? కొంతమంది ఘనులు ఈ దేశాన్ని దోచుకుంటే మనం చూస్తూ ఉండిపోవాల్సిందేనా?  I PITY MY COUNTRY.

Tuesday, February 15, 2011

SAVE INDIA




భారతదేశం గొప్ప సంపన్నదేశం. అందుకే శతాబ్దాలుగా ఇది దోపిడీకి గురవుతోంది. ఇక్కడి ప్రజలు కూడా శాంతి కాముకులే. ఇక్కడి ప్రజలకు పరమత సహనం, ప్రేమ, ఆప్యాయతలు కూడా ఎక్కువే. అందుకే ఎక్కడివాడో వచ్చి మనల్ని నిలువునా దోచుకుంటున్నాడు. ఇలా ఎంత కాలం? మనం ఎప్పుడూ ఇలా నష్టపోవాల్సిందేనా? ఈ దోపిడీ రాజ్యం ఆంగ్లేయులతోనే అంతరించి పోతుందని ఆశపడినా... లాభం లేకుండా పోయింది.

ఇంగ్లీషోల్లు మిగిల్చింది ఊడ్చేయడానికి మన నల్లదొరలు బతికే ఉండటం మనం చేసుకున్న పాపం. గాంధీజీ కలలుగన్న శ్రీరామరాజ్యం కల్లలుగానే ఉండిపోయింది. రాజకీయ వ్యవస్థ దగ్గర్నుంచి శాసన వ్యవస్థ, న్యాయవ్యవస్థలు పూర్తిగా భ్రష్టుపట్టిపోయాయి. వారికి మీడియా కూడా వంతపాడుతోంది. అందుకే ఇండియా ఇలా దాపురించింది.

అప్పట్లో చిన్నపాటి అవినీతి జరిగితే- ఎంతో నిరసన వ్యక్తమయ్యేది. ఇపుడు వేలు కాదు, లక్షలు కాదు, కోట్లు కాదు... ఏకంగా వందల కోట్లు, వేల కోట్లు, లక్షల కోట్లు మేస్తున్నారు. దేశాన్ని ఏలుతున్న వారే- దేశసంపదను కొల్లగొడుతుంటే- మనం నిశ్చేష్ఠులై ఉండిపోతున్నాం. ఎందుకిలా జరుగుతోంది. ఎంతకాలం ఇలా భరించాలి. అధికారం ఉన్నోడు- దొరలా దోచుకోవాల్సిందేనా? పేదరికంలో మగ్గినోడు- పాపర్‌గా మిగిలిపోవాల్సిందేనా?

ఇంకెన్నాళ్లు... ఈ దోపిడీ రాజ్యం... ఇంకెన్నాళ్లు భరించాలి... ఈ దోపిడీదొంగల్ని. మనం ఉప్పు కారం తినట్లేదా? మనలో చేవ తగ్గిపోతోందా? మన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఐ.ఎ.ఎస్‌.లు, ఐ.పి.ఎస్‌.లు, న్యాయాధికారులు, ఇతర ప్రభుత్వ ఉద్యోగుల అవినీతికి అడ్డులేదా? ఇకనైనా మనం ఈజిప్టు సోదరులనుంచి ఏమైనా నేర్చుకుంటామా? హే రామ్‌! నా దేశాన్ని రక్షించు... ఈ రాబందుల నుంచి... ఈ దోపిడీగాళ్ల నుంచి... SAVE INDIA.

Thursday, February 10, 2011

స్కాముల సర్కారు...


.

యూపీఏ-2 ప్రభుత్వం నిజంగానే- మన్మోహన్‌ సింగ్‌ లాంటి మేధావికి చేటు తెచ్చింది. చిన్నాచితకా భాగస్వామ్యపార్టీలతో సర్కారు ఏర్పాటు చేయడం వల్ల- మన ప్రధాని మౌనంగా అన్నీ భరిస్తున్నారు. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న అవినీతి భాగోతం- ఆయనకు తెలిసే జరుగుతోందని కొంద రు, ఆయనకు సంబంధం లేదని ఇంకొందరు వాదించవచ్చు గాక... కానీ ప్రధానమంత్రికి తెలిసి జరిగినా... తెలియక జరిగినా... ఇండియాలో ప్రస్తుతం స్థితి ఏమంత బాగోలేదు. ప్రధాన మంత్రి కార్యాలయం, నిఘా సంస్థలు, రాజకీయ పార్టీలు, శాసనకర్తలు, ఎగ్జిక్యూటివ్‌... వగైరా వగైరా! కానీ ఏం లాభం జరగాల్సిన నష్టం జరిగిపోయింది. 2జీ స్కాం, 3జీ స్కాం, లేటెస్ట్‌గా 4జీ స్కామ్‌... ఇదంతా ప్రభుత్వ అవినీతిని ఎత్తిచూపుతున్నాయి.

ఇక, సోనియా జీ అంతరంగం ఏమిటో అంతుబట్టడం లేదు. ఆమె తన కొడుకు రాహుల్‌ను ఒకవైపు ప్రధాని చేయాలని కలలు కంటున్నారు. కానీ యూపీఏ-2 ప్రభుత్వాన్ని మాత్రం అవినీతికూపం నుంచి బయటపడవేయలేకపోతున్నారు. కామన్‌వెల్త్‌ గేమ్స్‌, ఆదర్శ్‌ కుంభకోణాలు మీడియా చలవతోనే బయటపడ్డాయి.

నాకు అనిపిస్తుంది... భారతంలో సమర్థులైన జర్నలిస్టులు లేకపోతే- ఈ నేతలు, అధికారులు కలిసి- ఇండియానే స్విస్‌ బ్యాంకులో తాకట్టు పెట్టేవారేమో?    LONG LIVE JOURNALISM.