Monday, August 22, 2011

LONG LIVE ANNA

ఇపుడు జగమంతా ఒక్కటే మంత్రం. అదే అన్నా హజారే మంత్రం. అవును ఓ గాంధేయవాది నిస్వార్థంగా చేపట్టిన పోరాటం- యావత్‌ జాతిని కదిలించింది. కులమత భేదాలు లేకుండా, వయోపరిమితి భేదాలు లేకుండా అందర్నీ ఒక్క తాటిపైకి తెచ్చింది. ముఖ్యంగా యూపీఏ-2 సర్కార్‌ అధికారంలోకి వచ్చాక దేశంలో అవినీతి విచ్చలవిడిగా జరిగింది. రాజకీయ రాబందులు జాతి సంపదను దోచుకున్నారు. మనకళ్లముందే వేల కోట్ల రూపాయల గుటకాయ స్వాహా అయిపోయాయి. ఇవన్నీ చూస్తూ మనమనంతా ఊరుకున్నాం. మనకెందుకులే అని కళ్లుమూసుకున్నాం. కానీ న్యాయవ్యవస్థ, జాతీయ మీడియా అవినీతి కూపాన్ని బయటకు లాగాయి.
సంకీర్ణధర్మం అంటూ మన ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ వేదాలు వల్లిస్తుంటే- రాజా, కనిమొళి, కల్మాడీ తదితరులు కోట్లు మేశారు. కర్ణాటకలోనూ ఇదే జరిగింది. కానీ అక్కడి లోకాయుక్త చేసిన మేలు వల్ల కొంత న్యాయం జరిగింది. అవినీతి యడ్యూరప్ప తన సీఎం కుర్చీని వదిలిపెట్టక తప్పలేదు. బలమైన లోకాయుక్త, లోకపాల్‌ వ్యవస్థలు ఉంటే రాష్త్రాలు, దేశం అవినీతి కోరల నుంచి బయటపడతాయి.

లోకపాల్‌ చట్టం పరిధిలోకి ప్రధాని మంత్రేకాదు న్యాయవ్యవస్థ కూడా ఉండాలనేదే అన్నా హజారే డిమాండ్‌. అదే కేంద్రానికి, ఇతర జాతీయ పార్టీలకు నప్పడం లేదు. న్యాయవ్యవస్థకూ ఇటీవల కొందరు మచ్చతెచ్చారు. వారంతా లోకపాల్‌కు జవాబుదారులే. అసలు కొంతకాలంగా ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఏం చేస్తున్నారో అంతుబట్టడం లేదు. ఆయన కొందరి చేతిలో కీలుబొమ్మగా మారినట్టు స్పష్టమవుతోంది. కాకపోతే మరేమిటి, ఎంతో మేధావిగా పేరు తెచ్చుకున్న పీఎం- ఈరోజు తలదించుకోవాల్సిన దుస్థితి ఎందుకొచ్చింది? లోకపాల్‌ బిల్లు పరిధిలోకి ప్రధాని ఉండటంలో త ప్పులేదని ఆయన చెబుతున్నా, కాంగ్రెస్‌ పార్టీ పెద్దలు ఎందుకు జంకుతున్నారు? అంటే- ప్రధానికి ఏం చేసినా చెల్లుబాటు అవుతుందా?
నిజానికి గత వారం రోజులుగా భారతీయ మీడియాలో అన్నా వార్తలే. ఆయనకు మద్దతుగా దేశమంతా ర్యాలీలు. మొదట్లో లైట్‌ తీసుకున్న కేంద్రం ఇపుడు భయంతో వణికిపోతోంది. అన్నా తీసుకొచ్చిన విప్లవం చూసి పెద్దలు ఆందోళన చెందుతున్నారు. ఆయన్ను ఎలా లొంగదీసుకోవాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. తీహార్‌ జైలుకు పంపి నాలుక కర్చుకున్న కేంద్రం ఇపుడు అన్నా ముందు దోషిగా నిలబడింది. నిజంగానే దేశంలో ఇపుడు రెండో స్వాతంత్య్ర పోరాటం చేస్తోంది. అవినీతిని తరిమికొట్టే సమయం ఆసన్నమైంది.
ఇంక్విలాబ్‌ జిందాబాద్‌, అన్నా జిందాబాద్‌.  జైబోలో భారత్‌మాతాకీ జై!



Monday, May 16, 2011

GREAT INSPIRATION



నేల తల్లి తన ఇద్దరు ముద్దు బిడ్డలను తనలో విలీనం చేసుకుంది. ఒకరు మానవ హక్కుల కోసం గళం ఎత్తితే, మరొకరు రైతన్న కోసం నినదించారు. ఆ ఇద్దరు మహానుభావులను 24 గంటల తేడాలో మనల్ని శాశ్వతంగా
వదిలి వె ళ్లడం నన్ను తీవ్రంగా కలచి వేసింది.

మన తెలుగుబిడ్డ కాకతీయ యూనివర్సిటీ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ బుర్రా రాములు- ఎక్కడ హక్కులు భంగపడితే అక్కడ వాలేవారు. బడుగు వారి పక్షాన పోరాడేవారు. ట్రేడ్‌ యూనియన్లలోనూ, పౌరహక్కుల సంఘంలోనూ, తర్వాత మానవహక్కుల వేదికలోనూ ఆయన చేసిన సేవలు ఈ తరం వారికి ఆదర్శప్రాయం.




ఇక మహేంద్రసింగ్‌ తికాయత్‌ గురించి మన తెలుగువారికి చాలా తక్కువ తెలుసు. ఆయన అవిశ్రాంత రైతు పోరాట యోధుడు. ఉత్తర భారతంలో రైతాంగానికి ఆయన పెద్ద దిక్కుగా నిలిచారు. భారతీయ కిసాన్‌ యూనియన్‌ పక్షాన తికాయత్‌ చేసిన పోరాటం కారణంగా అన్నదాతకు ఎంతో మేలు జరిగింది. ఉత్తరప్రదేశ్‌ లోని ముజఫర్‌నగర్‌ జిల్లాకు చెందిన ఆయన చెరుకుకు మద్దతు ధర కల్పించాలని, భారమైన రుణాల మాఫీ కోసం, విద్యుత్‌ ఛార్జీల తగ్గింపు కోసం మహాధర్నాలు నిర్వహించి, కేంద్రాన్ని ఉక్కిరిబిక్కిరి చేశారు.

ఈ ఇద్దరు జన నేతలకు నా శ్రద్ధాంజలి...

Saturday, April 23, 2011

HEY BHAGAVAN







భగవాన్‌... సత్య సాయిబాబా...ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవం. ఆయన చేపట్టిన సేవా కార్యక్రమాలు, చేసిన ఆధ్యాత్మిక భోదనలు అనన్య సామాన్యమైనవి. ఆయన నిర్యాణం చెందారన్న వార్త భక్తులనే కాదు యావత్‌ మానవాళిని కదిలించేసింది. ఎందుకంటే- ఆయన చేసిన సేవా కార్యక్రమాలు అటువంటివి. ఉన్నత విద్య, సూపర్‌ స్పెషాలిటీ వైద్యం, మంచినీటి సదుపాయం అందుబాటులోకి తీసుకురావడం ఆయనకే సాధ్యమైంది. ప్రపంచ వ్యాప్తంగా ఎందరో గురువులు, మహిమాన్విత వ్యక్తులు ఉన్నారు. కానీ ఎవ్వరూ చేయని విధంగా,  ఈ సాయి చేయడం విశేషం. అందుకే నాకు విశ్వాసం లేకున్నా... ఆయన సేవాభావాన్ని ప్రేమించాను.


ఆయన మహిమల గురించి వినిపించే విమర్శలను నేను పట్టించుకోను... ఎందుకంటే- ఆయన సేవా కార్యక్రమాల ముందు- ఈ విమర్శలు నిలబడవు కాబట్టి. చివరకు బీబీసీ మీడియా కూడా బాబాను అప్రతిష్టపాలు చేయాలని ప్రయత్నించింది. నిత్యం తనను దర్శించుకునే భక్తులకు బాబా ప్రముఖంగా అయిదు సూత్రాలు భోదించారు. అవి- ప్రేమ, శాంతి, ధర్మం, సత్యం, అహింస... నిజంగా ఈ పదాలు వింటేనే నా మనసు పులకించిపోతుంది. వీటినే ఆధారంగా చేసుకుంటే మానవుని జీవితం ధన్యమవుతుందని బాబా చెప్పారు.


ఆయన భోదనల్లో నాకు నచ్చిన ప్రవచనం... నేను దేవుడిని, నీవు కూడా దేవుడివే, తేడా ఏమిటంటే, ఈ సంగతి నాకు తెలుసు, నీకు అసలు తెలియదు.

Saturday, April 2, 2011

SALUTE TO MEN IN BLUE



యస్‌... ఇండియా రాక్స్‌... ఈ పదాలు రాస్తుంటే నా శరీరం పులకిస్తుంది. నా మనసు పరవశిస్తుంది. నా శ్వాస జయహో అంటోంది. అవును. ఎన్నాళ్లకెన్నాళ్లకు మన క్రికెట్‌ వీరులు మళ్లీ జగజ్జేతలయ్యారు. ఫైనల్లో మనం గెలుస్తామని నాకు ఎంతో ధీమా ఉంది. ఎందుకంటే- బ్యాటింగ్‌లో అద్భుతమైన ఆటతీరును కనబరుస్తున్న మన  ఆటగాళ్లు...నాకౌట్‌లోకి ప్రవేశించేసరికి జగదేకవీరుడి వలె ప్రత్యర్థిని చిత్తుచేశారు. బౌలర్లు చెలరేగితే, ఫీల్డర్లు మైదానంలో పాదరసంలా జారారు. మనవాళ్లు పులిలా వేటాడుతుంటే ప్రత్యర్థులు జింక పిల్లల్లా చెల్లాచెదురయ్యారు. ఫైనల్‌ ప్రత్యర్థి శ్రీలంక మనతో సమఉజ్జీగా నిలిచే జట్టే కానీ, 275 పరుగుల విజయలక్ష్యం మనవారికి చాలా చిన్నది. ఎందుకంటే- పిచ్‌లో బౌలర్లకు పెద్దగా ఏమీ లేదు. కాబట్టే నేను ధీమాగా ఉన్నాను. అందరికీ ఇండియాదే ట్రోఫీ అని చెప్పాను. అదే నిజమైంది. ఆ తర్వాత భారతావని జనసంద్రంగా మారింది. అందరూ వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. మిఠాయిలు పంచుకున్నారు. బాణాసంచా కాల్చారు. మా ఇంట్లోనూ పిల్లలు దీపావళి జరిపారు.






ఇవన్నీ చూస్తుంటే నాకు చిన్ననాటి తీపి జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి. 1983 జూన్‌ 25వ తేదీ నాకు బాగా గుర్తు. కలర్‌ టీవీలు అప్పుడప్పుడే వచ్చాయి. ఆ నాటి భారత్‌-వెస్టిండీస్‌ టైటిల్‌ ఫైట్‌ను నేను కళ్లారా చూశాను. ఇండియా విక్టరీ ఘడియలను బీబీసీ రేడియోలో ప్రత్యక్ష వ్యాఖ్యానం ద్వారా విని ఉబ్బితబ్బిబ్బయ్యాను. ఒక్కో విండీస్‌ వికెట్‌ నేలకూలుతుంటే- నేను ఉద్వేగంతో కేరింతలు కొట్టాను. నాకోసం నా తండ్రి కూడా మేల్కొన్నారు. నన్ను ఉత్సాహపరిచారు. ఆ రోజు లార్డ్స్‌ మైదానం ఇండియా ఫ్యాన్స్‌తో నిండిపోయింది. ఇండియాలోనూ అందరూ ఇళ్లలోనే సంబరాలు చేసుకున్నారు.