Showing posts with label Politics. Show all posts
Showing posts with label Politics. Show all posts

Monday, August 22, 2011

LONG LIVE ANNA

ఇపుడు జగమంతా ఒక్కటే మంత్రం. అదే అన్నా హజారే మంత్రం. అవును ఓ గాంధేయవాది నిస్వార్థంగా చేపట్టిన పోరాటం- యావత్‌ జాతిని కదిలించింది. కులమత భేదాలు లేకుండా, వయోపరిమితి భేదాలు లేకుండా అందర్నీ ఒక్క తాటిపైకి తెచ్చింది. ముఖ్యంగా యూపీఏ-2 సర్కార్‌ అధికారంలోకి వచ్చాక దేశంలో అవినీతి విచ్చలవిడిగా జరిగింది. రాజకీయ రాబందులు జాతి సంపదను దోచుకున్నారు. మనకళ్లముందే వేల కోట్ల రూపాయల గుటకాయ స్వాహా అయిపోయాయి. ఇవన్నీ చూస్తూ మనమనంతా ఊరుకున్నాం. మనకెందుకులే అని కళ్లుమూసుకున్నాం. కానీ న్యాయవ్యవస్థ, జాతీయ మీడియా అవినీతి కూపాన్ని బయటకు లాగాయి.
సంకీర్ణధర్మం అంటూ మన ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ వేదాలు వల్లిస్తుంటే- రాజా, కనిమొళి, కల్మాడీ తదితరులు కోట్లు మేశారు. కర్ణాటకలోనూ ఇదే జరిగింది. కానీ అక్కడి లోకాయుక్త చేసిన మేలు వల్ల కొంత న్యాయం జరిగింది. అవినీతి యడ్యూరప్ప తన సీఎం కుర్చీని వదిలిపెట్టక తప్పలేదు. బలమైన లోకాయుక్త, లోకపాల్‌ వ్యవస్థలు ఉంటే రాష్త్రాలు, దేశం అవినీతి కోరల నుంచి బయటపడతాయి.

లోకపాల్‌ చట్టం పరిధిలోకి ప్రధాని మంత్రేకాదు న్యాయవ్యవస్థ కూడా ఉండాలనేదే అన్నా హజారే డిమాండ్‌. అదే కేంద్రానికి, ఇతర జాతీయ పార్టీలకు నప్పడం లేదు. న్యాయవ్యవస్థకూ ఇటీవల కొందరు మచ్చతెచ్చారు. వారంతా లోకపాల్‌కు జవాబుదారులే. అసలు కొంతకాలంగా ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఏం చేస్తున్నారో అంతుబట్టడం లేదు. ఆయన కొందరి చేతిలో కీలుబొమ్మగా మారినట్టు స్పష్టమవుతోంది. కాకపోతే మరేమిటి, ఎంతో మేధావిగా పేరు తెచ్చుకున్న పీఎం- ఈరోజు తలదించుకోవాల్సిన దుస్థితి ఎందుకొచ్చింది? లోకపాల్‌ బిల్లు పరిధిలోకి ప్రధాని ఉండటంలో త ప్పులేదని ఆయన చెబుతున్నా, కాంగ్రెస్‌ పార్టీ పెద్దలు ఎందుకు జంకుతున్నారు? అంటే- ప్రధానికి ఏం చేసినా చెల్లుబాటు అవుతుందా?
నిజానికి గత వారం రోజులుగా భారతీయ మీడియాలో అన్నా వార్తలే. ఆయనకు మద్దతుగా దేశమంతా ర్యాలీలు. మొదట్లో లైట్‌ తీసుకున్న కేంద్రం ఇపుడు భయంతో వణికిపోతోంది. అన్నా తీసుకొచ్చిన విప్లవం చూసి పెద్దలు ఆందోళన చెందుతున్నారు. ఆయన్ను ఎలా లొంగదీసుకోవాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. తీహార్‌ జైలుకు పంపి నాలుక కర్చుకున్న కేంద్రం ఇపుడు అన్నా ముందు దోషిగా నిలబడింది. నిజంగానే దేశంలో ఇపుడు రెండో స్వాతంత్య్ర పోరాటం చేస్తోంది. అవినీతిని తరిమికొట్టే సమయం ఆసన్నమైంది.
ఇంక్విలాబ్‌ జిందాబాద్‌, అన్నా జిందాబాద్‌.  జైబోలో భారత్‌మాతాకీ జై!



Saturday, March 19, 2011

POLITICS & MONEY





ఏ ముహుర్తంలో ఈ దేశానికి ఫ్రీడం వచ్చిందో గాని, అంతా అవినీతిమయం అయిపోయింది. అన్ని వ్యవస్థలు భ్రష్టుపట్టిపోతున్నాయి. ఒకప్పుడు పనిచేస్తేనే లంచం తీసుకునేవాళ్లు. ఇపుడు పనిచేయకపోయినా... డబ్బులు దండుకుంటున్నారు. స్కీముల పేరు చెప్పి- దొరికినకాడికి దోచుకుంటున్నారు. అడిగే నాథుడే లేడు. ఎందుకంటే- అందరి నోళ్లు డబ్బు మూయిస్తోంది కాబట్టి.


వికీ లీక్స్‌ తీగల దుమారం రెండురోజులుగా పార్లమెంట్‌ను కుదిపేస్తోంది. ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నాయి. ఈ అవకాశాన్ని తమకు అనుకూలం చేసుకోవాలని పాపం కమలనాథులు విఫలయత్నం చేస్తున్నారు. వారు అధికారంలో ఉండగా ఏం జరిగిందో అందరికీ తెలుసు. ఏ పార్టీని, ఏ నాయకున్ని నమ్మే రోజులు కావు ఇవి.


తమిళనాడులో ఎన్నికలకు ముందే అవినీతి కంపు కొడుతోంది. కోట్లాది రూపాయలు పంచిపెడుతున్నారు. నానారకాల స్కీములు ప్రవేశపెట్టి- ఓటర్లను మభ్యపెడుతున్నారు. ఇది ఒకందుకు మంచిదే. ఇన్నాళ్లపాటు పేదల కడుపుకొట్టి దోచుకున్న ధనం మళ్లీ పేదల చెంతకే వెళ్లడం ఒక మంచి పరిణామమే. కానీ ఇలా గెలిచిన వాళ్లు మళ్లీ జనంపై విరుచుకుపడతారు. ఖజానా లూటీ చేస్తారు. అపుడు నిలదీసే హక్కు ప్రజలకు ఉండదు.


తాజాగా, మన రాష్ట్రంలో జరిగిన MLC ఎన్నికలు- అన్ని పార్టీలలో కలకలం రేపాయి. ముఖ్యంగా KCRకు ఈ ఎన్నికలు మంచి గుణపాఠమే నేర్పాయి. ఏదో తల్చుకుంటే- ఏదో జరిగింది. ముగ్గురు ఎమ్మెల్యేలు క్రాస్‌ఓటింగ్‌ చేశారన్న వార్త కొందర్ని నిశ్చేష్టపరిచింది. అధినేతకు తెలిసే జరిగిందని కొందరు, లేదని కొందరు వాదిస్తున్నారు. మొత్తం మీద ముగ్గురిపై సస్పెన్షన్‌ వేటుతో కేసీఆర్‌ తనపై అనుమానాలను కొంతమేరకు తగ్గించగలిగారు.

Monday, February 28, 2011

My Telangana


జై తెలంగాణ... ఈ పదాన్ని ఉచ్చరించడానికి ఒక ప్పుడు వెనుకంజ వేసిన వాళ్లంతా ఇపుడు నినదిస్తున్నరు. ఇపుడు తెలంగాణ పల్లెపల్లెల్లో వినిపిస్తున్నది ఈ నినాదమే. పార్టీలు అక్కర్లేదు, నాయకులు అక్కర్లేదు, జెండాలు అక్కర్లేదు, అజెండాలు అక్కర్లేదు. ఇపుడు అంతా ఒకే గొంతుకై తెలంగాణ స్వాతంత్య్రానికి పోరాడుతున్నరు.

ఇన్నాళ్లుగా రాజకీయ పార్టీలు, రాజకీయ నేతలు, ప్రజలను తమ స్వార్థ ప్రయోజనాలకు వాడుకున్నరు. ఇక వారి కుటిలనీతి సాగదు. వారి దుష్టపన్నాగాలు సాగవు. ఇపుడు జై తెలంగాణ నినాదం ప్రజలది. నాలుగు కోట్ల తెలంగాణ బిడ్డలది. మన కోస్తాంధ్ర సోదరులు, ఉత్తరాంధ్ర సోదరులు, రాయలసీమ సోదరులు ఇది అర్థం చేసుకుంటున్నరు. కానీ అక్కడి నేతలు కొందరు దీన్ని భూతద్దంలో చూపించి- ఎప్పటిలాగే- తెలంగాణ ప్రజలను, తెలంగాణ ప్రాంతాన్ని దోచుకోవాలని కుట్రపన్నుతున్నరు.

ఇది 1969 కాదు, ప్రజలు మళ్లీ మోసపోవడానికి. చెన్నారెడ్డిని ఆనాడు అత్యధిక లోకసభ స్థానాలు గెల్చుకున్న తెలంగాణ ప్రజాసమితిని కేంద్రం పెద్దలు మాయమాటలు చెప్పి, మోసం చేసి ఉండవచ్చు. ఈనాడు కూడా కేసీఆర్‌ను, తెలంగాణ రాష్ట్రసమితిని మరోసారి మోసం చేసే ఆలోచనలో సీమాంధ్ర నేతలు, అటు ఢిల్లీ పెద్దలు కుట్ర చేస్తూ ఉండవచ్చు. కానీ నాలుగు కోట్ల తెలంగాణ గొంతుకలను ఆపలేరు. డబ్బులతో, లాలూచీతో ఏదో చేయాలనుకుంటే- మొదటికే మోసం వస్తుంది. ఉద్యమం అంతకంతకూ తీవ్ర రూపం దాలుస్తుంది. ఆ స్థితిని తీసుకురావద్దని నా మనవి.

మొన్న 48 గంటల దిగ్భందనానికే చాలామందికి విసుగుపుట్టింది. తెలంగాణపై కేంద్ర నాన్చుడు వైఖరిని అటు సమైక్యాంధ్రులే కాదు తటస్థులు కూడా తప్పుబట్టారు. ఇపుడు రైల్‌రోకో, ఈనెల ౧౦న మిలియన్‌ మార్చ్‌లు ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లతాయి. సోనియా, మన్మోహన్‌లే కాదు ఆంధ్ర, రాయలసీమ ప్రజాప్రతినిధులు ఇలాంటి వైఖరినే కొనసాగిస్తే- మున్ముందు ఉద్యమం మరింత తీవ్రరూపం దాలుస్తుంది. కొందరు స్వార్థరాజకీయ నాయకుల కోసం తెలుగు సోదరులు పోట్లాడుకోవాలా? తప్పు తప్పు. తెలంగాణ ఉద్యమ ప్రభంజనంలో కుటిల రాజకీయ నేతలు కొట్టుకుపోయే రోజు ఎంతో దూరంలో లేదు.

Thursday, February 17, 2011

IAS POLITICIAN


ఏదైతే జరగవద్దని... ఇన్నాళ్లుగా అనుకున్నానో... అదే జరిగింది. తెలంగాణ వాదిగా- ఉద్యమం శాంతియుతంగా జరగాలిని, సీమాంధ్ర సోదరుల అంగీకారం, సహకారంతోనే విడిపోవాలని కోరుకున్న వాళ్లలో నేనూ ఒక న్ని. కానీ... అసెంబ్లీ సాక్షిగా- కాంగ్రెస్‌ కుటిల రాజకీయాల సాక్షిగా దురద్రుష్టకరమైన సంఘటన జరిగే పోయింది. తెలంగాణ వాదాన్ని ఎప్పుడూ కించపరిచే మాజీ ఐ.ఎ.ఎస్‌. అధికారి- తాజా రాజకీయాలు అంటే పూర్తిగా అవగాహన లేని జేపీపై దాడి జరిగింది. ఓ ప్రజాస్వామ్యవాదిగా, ఓ శాంతికాముకుడిగా నేను ఆ దాడిని ఖండిస్తాను. కానీ జేపీ చేసిందేమిటి? అప్పటికే- అసెంబ్లీ లోపల మార్షల్స్‌చే గెంటివేయబడిన టి.ఆర్‌.ఎస్‌. ఎమ్మెల్యేలు ఎదురుగా ఉన్నప్పటికీ- లెక్కచేయకుండా, మీడియా ముందు అనవసర విషయాలను ప్రస్తావించడంతో- TRS శాసనసభ్యులు తమను తాము నియంత్రించుకోలేకపోయారు. దాని ఫలితమే ఆ దాడి.

అయితే- శాసనసభలో ఎన్నో పార్టీలున్నాయి. ఎందరో సీనియర్‌ శాసనసభ్యులున్నారు. తెలంగాణ వ్యతిరేక పార్టీలున్నాయి. కానీ ఎవ్వరికీ లేని అభ్యంతరాలు కేవలం జేపీకే ఉండటం కూడా అర్థంకానిది. అంతా వ్యూహాత్మకంగా పోతుంటే- లోకసత్తా నేత జయప్రకాశ్‌నారాయణ్‌ మాత్రం మీడియా పాయింట్‌ వద్ద ఇష్టానుసారంగా మాట్లాడి టి.ఆర్‌.ఎస్‌. ఎమ్మెల్యేలను రెచ్చగొట్టారు. దాని ఫలితమే ఈ దాడి.

జేపీ లాంటి నేతలు- కాంగ్రెస్‌ సభ్యులను చూసి చాలా నేర్చుకోవాలి. గవర్నర్‌ ప్రసంగం, టి.ఆర్‌.ఎస్‌, టీడీపీ వ్యూహాలకు జడిసి- ఢిల్లీలోనే దాచుకున్న కాంగ్రెస్‌ శాసనసభ్యులను చూసి జేపీ చాలా నేర్చుకోవాలి. ఎక్కడ తెలంగాణ వాదానికి మద్దతు ప్రకటించాల్సి వస్తుందన్న భయంతో కాంగ్రెస్‌ తెలంగాణ నేతలు- ఏపీ భవన్‌లోనే మకాం వేస్తే- ఇక్కడ జేపీ లాంటి వారు కాంగ్రెస్‌ చేతిలో పావుగా మారారు.

SORRY PM



ఇటీవల కాలంలో ఎలక్ట్రానిక్‌ మీడియాలో వస్తున్న కుంభకోణాల శరపరంపరను తిప్పికొట్టడానికి అన్నట్టుగా దేశ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ప్రముఖ టెలివిజన్‌ ఛానెళ్ల ఎడిటర్లతో ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కానీ ఆర్థికరంగంలో తలపండిపోయిన మన్మోహన్‌ జీ- ఇంకా రాజకీయంలో ఎదగలేదని ఆయన వైఖరి స్పష్టమైంది. నిజమే- ఒక ఆర్థిక వేత్త, నిజాయితీపరుడికి రాజకీయం చేతకాదు. సొంతపక్షం చేతిలో కీలుబొమ్మగా మారిన మన్మోహన్‌- అటు సంకీర్ణంలోని భాగస్వామ్యపక్షాలనూ అదుపు చేయడంలో విఫలమవుతున్నారు. అదే- ఇపుడు దేశం పాలిట, ప్రజల పాలిట శాపమైంది.

ఎడిటర్లు సంధించిన ప్రశ్నలకు ప్రధాని జవాబు చెప్పలేక నీళ్లు నమలాల్సి వచ్చింది. టీవీలో మీడియా కాన్ఫరెన్స్‌ను చూసినవారికి ఇది గుర్తే ఉంటుంది CNN-IBN బాస్‌ రాజ్‌దీప్‌ సర్‌దేశాయ్‌ అడిగిన ప్రశ్నకు మన్మోహన్‌ నీళ్లు తాగాల్సి వచ్చింది. తన వల్ల తప్పులు జరుగుతున్నాయని అంగీకరించిన ప్రధాని- మొత్తం అవినీతికి తానే దోషిని అంటే కరెక్ట్‌ కాదన్నారు. మీడియా అత్యుత్సాహం వల్ల- మొత్తం భారతావని అవినీతి కూపంగా మారిందన్న అభిప్రాయం కల్పించే యత్నం కలుగుతోందని వాపోయారు. యూపీఎ-2 హయాంలో వెలుగులోకి వచ్చిన కుంభకోణాలను ప్రస్తావిస్తూ- అంతా పారదర్శకంగానే జరిగినట్టు తనవారిని వెనకేసుకొచ్చారు.

అసలు ప్రధాని ఏం చెప్పదల్చుకున్నారు? సంకీర్ణ సర్కారు ఉంటే- అవినీతి జరుగుతుందా? కళ్ల ముందే వేల కోట్లు ఎగరేసుకుపోతున్నా మన నిఘా సంస్థలు కళ్లు మూసుకోవాలా? ప్రభుత్వానికి ఇబ్బంది రావద్దు కాని- ప్రజల సొమ్ము లూటీ కావ ల్సిందేనా? ఇదేం న్యాయం? ఎవడబ్బసొమ్మని ఈ రాజకీయ రాబందులు- లాబీయిస్టులు, పారిశ్రామికవేత్తల  వైట్‌ కాలర్‌ నేరాలు జరగాల్సిందేనా? కొంతమంది ఘనులు ఈ దేశాన్ని దోచుకుంటే మనం చూస్తూ ఉండిపోవాల్సిందేనా?  I PITY MY COUNTRY.

Thursday, February 10, 2011

స్కాముల సర్కారు...


.

యూపీఏ-2 ప్రభుత్వం నిజంగానే- మన్మోహన్‌ సింగ్‌ లాంటి మేధావికి చేటు తెచ్చింది. చిన్నాచితకా భాగస్వామ్యపార్టీలతో సర్కారు ఏర్పాటు చేయడం వల్ల- మన ప్రధాని మౌనంగా అన్నీ భరిస్తున్నారు. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న అవినీతి భాగోతం- ఆయనకు తెలిసే జరుగుతోందని కొంద రు, ఆయనకు సంబంధం లేదని ఇంకొందరు వాదించవచ్చు గాక... కానీ ప్రధానమంత్రికి తెలిసి జరిగినా... తెలియక జరిగినా... ఇండియాలో ప్రస్తుతం స్థితి ఏమంత బాగోలేదు. ప్రధాన మంత్రి కార్యాలయం, నిఘా సంస్థలు, రాజకీయ పార్టీలు, శాసనకర్తలు, ఎగ్జిక్యూటివ్‌... వగైరా వగైరా! కానీ ఏం లాభం జరగాల్సిన నష్టం జరిగిపోయింది. 2జీ స్కాం, 3జీ స్కాం, లేటెస్ట్‌గా 4జీ స్కామ్‌... ఇదంతా ప్రభుత్వ అవినీతిని ఎత్తిచూపుతున్నాయి.

ఇక, సోనియా జీ అంతరంగం ఏమిటో అంతుబట్టడం లేదు. ఆమె తన కొడుకు రాహుల్‌ను ఒకవైపు ప్రధాని చేయాలని కలలు కంటున్నారు. కానీ యూపీఏ-2 ప్రభుత్వాన్ని మాత్రం అవినీతికూపం నుంచి బయటపడవేయలేకపోతున్నారు. కామన్‌వెల్త్‌ గేమ్స్‌, ఆదర్శ్‌ కుంభకోణాలు మీడియా చలవతోనే బయటపడ్డాయి.

నాకు అనిపిస్తుంది... భారతంలో సమర్థులైన జర్నలిస్టులు లేకపోతే- ఈ నేతలు, అధికారులు కలిసి- ఇండియానే స్విస్‌ బ్యాంకులో తాకట్టు పెట్టేవారేమో?    LONG LIVE JOURNALISM.

Monday, January 31, 2011

ఎవరిని నమ్మాలి...



నిజమే... తెలంగాణ విషయంలో ఎవ రిని నమ్మాలో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. ఎందుకంటే- ఆ ప్రాంతంలోని ప్రతి పార్టీ తెలంగాణ అంశం గురించి మాట్లాడుతోంది. దాన్ని ఏర్పాటును సమర్థిస్తోంది. ప్రత్యేక రాష్త్రం ఏర్పాటు కోసమే తెరపైకి వచ్చిన TRS పార్టీ ఇపుడు మరింత దూకుడుగా వెళ్తోంది. పనిలోపనిగా పార్టీ పునాదులను బలోపేతం చేసుకుంటోంది. అందుకే ఇతర పార్టీల దిగువస్థాయి నేతలను పెద్ద ఎత్తున పార్టీలోకి చేర్చుకుంటోంది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా... 50 అసెంబ్లీ, 10 ఎంపీ స్థానాలు గెలవడం కోసం KCR పక్కా ప్లాన్‌ చేస్తున్నారు.

మరోవైపు- అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీతోపాటు... ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీలు ఈ విషయంలో తెలంగాణవాదులను తికమకపెడుతున్నాయి. రెండు నాల్కల ధోరణి అవలంభిస్తూ- సమస్యను జటిలం చేస్తున్నాయి. ఒకరిపై ఒకరు బురద జల్లుకుంటు ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నాయి. కాంగ్రెస్‌ పార్టీలో మంత్రులు, ఎంపీలు ఎవరికివారే పోటీ సమావేశాలు పెట్టుకుంటున్నారు. పాపం... ప్రజలు ఇది గమనిస్తున్నారని వారికి తెలయదనుకుంటా.

ఇక వామపక్షలు ఎటూ తేల్చుకోలేకపోతున్నాయి. రెండు పార్టీలది చెరోదారి.  మజ్లిస్‌ పార్టీలో ఇంకా క్లారిటీ రాలేదు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను సపోర్ట్‌ చేస్తే ఏం లాభం... చేయకపోతే ఏం నష్టమో తేల్చుకోలేని పరిస్థితిలో MIM నేతలున్నారు. తెలంగాణకు మద్దతు ప్రకటించిన బీజేపీ రాజకీయ ప్రయోజనాలకే పెద్దపీట వేస్తూ- ప్రాంతీయత త్వాన్ని సొమ్ముచేసుకోవాలని ఆశపడుతోంది. లోకసత్తా అసలు పార్టే కాదు...

పాపం... చిరంజీవికి సరైన మార్గదర్శకత్వమే కరవైంది. ఎట్లాగూ పార్టీ పోయింది... ఇపుడు సినిమాలూ పోతున్నాయ్‌... అందుకేనేమో... అధికార పార్టీకి అనుకూలంగా మసులుతున్నారు. మేడమ్‌ను కలుస్తున్నారు. పీఎం కూడా అపాయింట్‌మెంట్‌ ఇచ్చేస్తున్నారు. కాంగ్రెస్‌ కూడా చిరు సంకటస్థితిని వాడుకుంటోంది.  జగన్మోహన్‌రెడ్డి  నుంచి పొంచి ఉన్న ప్రమాదాన్ని ద్రుష్టిలో పెట్టుకునే కాంగ్రెస్‌ హైకమాండ్‌ ఈ వ్యూహాన్ని అనుసరిస్తోంది అని చిన్న పిల్లాడిని అడిగినా తెలుస్తుంది.